- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దాతల సాయమే కడుపు నింపుతోంది !
– అద్దె చెల్లించలేక డ్రైవర్ల అవస్థలు
దిశ, న్యూస్ బ్యూరో: ‘రోజూ డ్యూటీకి వెళ్తేనే నెలాఖరుకు జీతం. అది కూడా వెళ్లినన్ని రోజులే లెక్కగట్టి ఇస్తారు. పదిహేను రోజుల నుంచి డ్యూటీ లేదు, జీతం లేదు. మేము ముగ్గురం డ్రైవర్లం కలిసి ఒకే రూములో ఉంటున్నాం.. ఎవరికీ పనులు లేవు. ఏం కొనాలన్నా పైసల్ లేవు. ఊర్ల నుంచి బియ్యం తెచ్చుకుందామన్నా పోలీసులు పోనివ్వడం లేదు. ఎవరైనా దాతలు ఇచ్చే అన్నం ప్యాకెట్లతోనే కడుపు నింపుకుంటున్నం’ – వరంగల్ జిల్లాకు చెందిన కార్ డ్రైవర్ నరేష్ ఆవేదన ఇది.
‘ఒకరి దగ్గరనే పనిచేస్తే నెల జీతం వస్తుంది. టెంపరరీ డ్యూటీలు చేస్తే రోజు లెక్కన ఉంటది. ఇచ్చే మొత్తం కూడా ఎక్కువ ఉంటది. డ్రైవర్ జీతం తక్కువగా అంటే నెలకు జీతం రూ.20 వేలు ఇస్తున్నరు. టెంపరరీగా పోతే ఒక్క రోజులోనే రూ. వెయ్యి, రూ.2 వేలు కూడా కొట్టుకోవచ్చు. బత్తా కూడా మిగులుతది. ఇష్టం లేని రోజు ఇంటి దగ్గరే ఉండొచ్చు. లాక్‌డౌన్ కాన్నుంచి ఎక్కడికి పోయేదీ లేదు. చేతిలో పైసల్ లేకుండా కష్టమవుతోంది.’ – నల్లగొండ జిల్లాకు చెందిన వెంకటేష్.
ఒక్కరిద్దరే కాదు.. డ్రైవింగ్ ఫీల్డ్‌లో ఉన్న అనేక మంది బ్యాచిలర్ల కష్టాలు ఇలాగే ఉంటున్నాయి. పదిహేను రోజుల నుంచి వారికి పని లేదు, వచ్చే డబ్బుల్లేవు. నగరంలో సుమారు 1,471 గుర్తింపు పొందిన ఏజెన్సీలు.. టెంపరరీ డ్రైవర్ సర్వీస్‌లను అందిస్తున్నాయి. ఒక ప్రముఖ ఏజెన్సీలో పది లక్షల మంది డ్రైవర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. సొంతంగా ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, లాయర్లు, వివిధ రంగాల ప్రొఫెషనల్స్ దగ్గర పనిచేసే వారు కలుపుకుంటే వీరి సంఖ్య 30 లక్షలకు పైమాటే. కష్టాల్లో హెచ్చుతగ్గులున్నా వీరందరిదీ ఒకే కథ.. పెండ్లయిన వారి బాధలు ఒక రకంగా ఉంటే.. బ్యాచిలర్ డ్రైవర్ల కష్టాలు ఇంకో రకంగా ఉన్నాయి. డ్రైవర్లు కనీసం సొంతూళ్లకు వెళ్దామన్నా వెళ్లే పరిస్థితి లేదు. రేషన్ కార్డులు ఉన్నవారు ఎక్కడైనా బియ్యం తీసుకునేందుకు అవకాశం ఉంది. కానీ బ్యాచిలర్ల పేర్లు ఊళ్లల్లో తల్లిదండ్రులతో పాటు ఉంటాయి. బియ్యం అక్కడే తీసుకున్నారు. ఆ బియ్యం ఇక్కడికి తేవాలన్నా వెళ్లనివ్వడం లేదు. పర్మినెంట్ డ్రైవర్ డ్యూటీ చేసేవారికి వారి ఓనర్లు జీతం ఇవ్వడం లేదు. పనిచేయనపుడు జీతం ఎలా అడుగుతామని డ్రైవర్లు చెబుతున్నారు. మార్చిలో వారం రోజులు పోగా మిగిలిన జీతం కూడా ఇచ్చేందుకు ఓనర్లు సిద్ధంగా లేరు. లాక్‌డౌన్ ఎప్పటివరకు పొడిగిస్తారో తెలియదు. తమ ఖర్చుల కోసం డబ్బులు ఉంచుకుందామనే ఉద్దేశంలో వారు అలా వ్యవహరిస్తున్నారు.
అయితే ఇద్దరు, ముగ్గురు కలిసి రూముల్లో ఉంటున్న బ్యాచిలర్ డ్రైవర్లకు కష్టాలు తప్పడం లేదు. ఒక నెల జీతం ఇప్పటికే తక్కువ వచ్చింది. ఏప్రిల్ నెల జీతం వచ్చే పరిస్థితి లేదు. దీంతో సరుకులు తెచ్చుకోవాలన్నా, అద్దె చెల్లించాలన్నా డబ్బులు లేవని డ్రైవర్లు వాపోతున్నారు. రెండు నెలల అద్దె ఒకేసారి చెల్లించాలని ఓనర్లు అడుగుతున్నారని నరేష్ చెబుతున్నారు. ఈస్ట్ మారేడ్ పల్లిలో ఉంటున్న నరేష్.. ఓ రిటైర్డు ప్రభుత్వ ఉద్యోగి వద్ద మూడు నెలల క్రితమే ఉద్యోగంలో చేరాడు. లాక్‌డౌన్ కాలానికి జీతం ఇవ్వాలని ప్రభుత్వం చెప్పింది కదా అని అతనితో అంటే.. ‘మూడు నెలలు నా పనితనం చూసి జీతం ఎంతో చెబుతానన్నారు. ఇంకా జీతం విషయంలోనే సరిగా ఒప్పందం కుదరలేదు. ఇప్పుడు మీరన్న మాట చెబితే ఉన్న ఉద్యోగం కూడా పోతుంది. మార్కెట్లో ఉద్యోగాలు కూడా దొరికే పరిస్థితి లేదు’ అంటూ నరేష్ ముగించాడు.
టెంపరరీ డ్రైవింగ్ డ్యూటీలు చేసే వారి బాధలు మరోరకంగా ఉన్నాయి. రెగ్యులర్ డ్రైవర్ల కంటే ఎక్కువ సంపాదిస్తుండటంతో ఖర్చులు కూడా అదేవిధంగా ఉన్నాయి. డబ్బులు ఎక్కువ వచ్చినా డ్యూటీ చేస్తేనే ఆ రోజు నడిచేది. ఇప్పుడు డ్యూటీలు లేవు, డబ్బులు రావడం లేదు. తన వాటాగా వచ్చిన రెంట్, రూం మెయింటెనెన్స్ ఇవ్వాలని మిగిలినవారు అడుగుతున్నారు. అన్ని బాగున్నపుడు ఒకరి దగ్గర ఉంటే మరొకరు సర్దుకునేవారు. ఇప్పుడు అందరదీ ఒకే పరిస్థితి. దీంతో చేతిలో డబ్బుల్లేక ఇబ్బందులు పడుతున్నారు. డ్రైవర్ పనులు చేసే వారి మీద ఓనర్లకు అంత సదభిప్రాయం ఉండదని, అందుకే వారు ముందుగానే అద్దె వసూలు చేసుకుంటారని ఆనంద్ అనే డ్రైవర్ చెబుతున్నాడు. రూములో ఉండే మా ముగ్గురి వద్ద కలిపినా రూ.2 వేలు కూడా లేవు. ఇంటి దగ్గర నుంచి పంపించమని అడిగాం.. రూం రెంట్ కట్టేసి ఎలాగోలా ఇంటికి వెళ్లిపోవాలని వారు భావిస్తున్నారు. ఇక్కడే ఉంటే రోజూ దాతలు అన్నం పెడతారనే నమ్మకం లేదు. రానున్న రోజుల్లో ప్రభుత్వం ఎలాంటి నిబంధనలు అమలు చేస్తుందో.. ఇంకా ఎన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందోననే ఆందోళన డ్రైవర్లలో కనిపిస్తోంది.
Tags: corona, lockdown, kcr, Hyderabad,car, driver