పల్లెకూ విస్తరించిన ‘మత్తు’

by Sridhar Babu |
పల్లెకూ విస్తరించిన ‘మత్తు’
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: గంజాయి మత్తు యువత జీవితాలను నాశనం చేస్తున్నది. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా మత్తులో తూగుతున్నారు. ఫ్యాషన్ గా ప్రారంభించి బానిసలుగా మారి చివరికి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. గంజాయి బిజినెస్ మాఫియాకు కాసులు కురిపిస్తుంటే బానిసైన యూత్ భవితను ప్రశ్నార్థకంగా మారుస్తున్నది. ఉమ్మడి కరీంనగర్‌లో ఇటీవల కాలంలో యువత గంజాయి సేవిస్తూ పట్టబడటం కలకలం రేపుతున్నది.

యువత గంజాయి మత్తులో జోగుతోంది. యూత్ నే లక్ష్యం చేసుకున్న వ్యాపారులు గంజాయిని వారికి చేరవేసి సొమ్ము చేసుకుంటున్నారు. మత్తుతో గమ్మత్తైన ప్రపంచంలో విహరిస్తున్న యువత కూడా గంజాయిని అలవాటు చేసుకునేందుకు రోజు రోజుకు పెరిగిపోతున్నారు. నిన్న మొన్నటి వరకు పట్టణాల్లోని కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన గంజాయి ఇప్పుడు ఊరు వాడ పల్లె పట్నం అన్ని ప్రాంతాలకు విస్తరించింది. నిత్యం గంజాయి వ్యాపారం ద్వారా లక్షల రూపాయలు టర్నోవర్ అవుతున్నది. గంజాయి వ్యసనంతో లక్ష్యం వైపు సాగాల్సిన యువత దారి మళ్లుతున్నారు. ఇటీవల కాలంలో కరీంనగర్, రామగుండం కమిషనరేట్ల పరిధిల్లో వరసగా గంజాయి స్మగ్లర్లను పట్టుకున్న సంఘటనలే ఇందుకు ఉదాహరణ.

వందకో సిగరెట్టు…
వంద రూపాయలకో సిగరెట్టు చొప్పున గంజాయి నింపి అమ్ముతున్నారు. వీరు ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున గంజాయిని తెప్పించుకుని పలు ప్రాంతాల్లో విక్రయాలు జరుపుతున్నారు. సిగరెట్లలో పొగాకుతో పాటు గంజాయిని నింపి విక్రయిస్తున్న ఈ ముఠాల సంఖ్య ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున పెరిగిపోయింది. ఒక్కో సిగరెట్టును రూ. వంద చొప్పున అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. రూ. 7 నుంచి రూ. 10 వేలకు కిలో చొప్పున గంజాయిని కొనుగోలు చేసి ఉమ్మడి జిల్లాలోని పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలకు తరలిస్తున్నారు. చిన్న ప్యాకెట్లు తయారు చేసి రూ.500 నుంచి 700 లకు అమ్ముతున్నారు.

పల్లెలకు పాకిన జాడ్యం…
గంజాయి మత్తుకు ఇప్పటి వరకు పట్ణణాలకు చెందిన వారే ఎక్కువగా అడిక్ట్ అయ్యే వారు. కానీ ఇటీవల కాలంలో పల్లెల్లో కూడా దీనిని వినియోగించేవారు ఎక్కువయ్యారు. ఇంతకు ముందు డిగ్రీ చదివే విద్యార్థులు గంజాయిని వినియోగించే వారు కానీ ఇప్పుడు 8వ తరగతి చదువుతున్న మైనర్లు కూడా దీనికి అలవాడు పడటం ఆందోళన కల్గిస్తున్నది. కరీంనగర్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఇటీవల ఉమ్మడి జిల్లాలో జరిపిన దాడుల్లో మైనర్లు కూడా పట్టుబడ్డారు. అయితే గంజాయి వినియోగిస్తున్న వారు బాధితులు అయినందున దీనిని అమ్మేవారు, స్మగ్లింగ్ చేసే వారి కోసం స్పెషల్ టాస్క్ పెట్టి పట్టుకుంటున్నారు. దీంతో పెద్ద ఎత్తున గంజాయిని పట్టుకుంటున్నారు.

అటవీ ప్రాంతాల్లో సాగు…
ఇప్పటి వరకు పోలీసులు పట్టుకున్న గంజాయి స్మగ్లర్లను, వ్యాపారులను పట్టుకుని విచారించి పూర్తి వివరాలు రాబట్టారు. ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి ఖమ్మం జిల్లాల నుండి పెద్ద ఎత్తున కరీంనగర్ జిల్లాకు గంజాయి తరలి వస్తోందని గుర్తించారు. అయితే ఆయా జిల్లాల్లోని అటవీ ప్రాంతాల్లో పండిస్తున్న గంజాయిని వివిధ మార్గాల గుండా కరీంనగర్ జిల్లాకు తీసుకొస్తున్నారు.

కట్టడి లేకపోతే ఖతమే…
కరీంనగర్‌లోని జ్యోతినగర్‌లో యువత గంజాయి సేవిస్తున్నారన్న సమచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు పకడ్భందీగా ప్లాన్ చేసి పట్టుకున్నారు. మత్తుకు అలవాటు పడ్డ వారిపై నిఘా వేసి స్మగ్లింగ్ చేస్తున్న వ్యాపారులను అరెస్ట్ చేయడమే ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. పెరిగిన గంజాయి దందాను నియంత్రించేందుకు కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. లేనట్టయితే రానున్న కాలంలో గంజాయి వినియోగం తీవ్రంగా పెరిగిపోయే ప్రమాదం లేకపోలేదు.

Advertisement

Next Story