- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గంజాయి దందా.. తెర వెనుక చక్రం తిప్పుతున్న రౌడీ షీటర్లు..
దిశ, కొత్తగూడెం : గంజాయి చీకటి దందా జిల్లాకు శాపంగా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా గంజాయి చీకటి సామ్రాజ్యం చాప కింద నీరులా విస్తరించింది. ఈ గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడానికి జిల్లా పోలీసు యంత్రాంగం అహర్నిశలు కృషి చేస్తున్నా చీకటి వ్యాపారానికి అడ్డుకట్ట పడటం లేదు. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్న చందంగా తయారైంది ప్రస్తుత పరిస్థితి. జిల్లా పోలీసు యంత్రాంగం గంజాయి అక్రమ రవాణాను ఎప్పటికప్పుడు పటిష్ట నిఘాతో పట్టుకుంటున్నా అక్రమార్కులు మాత్రం దొడ్డిదారిలో గంజాయి దిగుమతి చేసి యథేచ్ఛగా అమ్మకాలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసు కేసులను కూడా వారు లెక్కచేయడం లేదు.
రౌడీ షీటర్ల చేతిలో గంజాయి దందా..
గంజాయి వ్యాపార సామ్రాజ్యం రౌడీషీటర్ల చేతికి చిక్కింది. ఈజీ మనీ ఎలా సంపాదించాలి అన్న ఆలోచన వచ్చిన రౌడీషీటర్లు కొంతమంది.. తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించవచ్చు అన్న అత్యాశతో ఈ వ్యాపారాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో పోస్ట్ ఆఫీస్, బర్లీఫీట్, రామాటాకీస్, న్యూ గొల్లగూడెం, బాబు క్యాంప్, రుద్రంపూర్, త్రీటౌన్, లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి వంటి ఏరియాల్లో కొంత మంది రౌడీషీటర్లు వెనక నుండి ఈ వ్యాపారం నడిపిస్తున్నారు. తమకు ఏమీ తెలియదు.. మేము సత్ప్రవర్తనతో జీవిస్తున్నామంటూ బయటికి కలరింగ్ ఇస్తూ గుట్టుగా గంజాయి వ్యాపారం చేస్తున్నారు. వారు సేవిస్తూ అందరికీ అందుబాటు ధరలకు గంజాయి సరఫరా చేస్తున్నారు.
ఇటీవల కాలంలో కొంత మంది రౌడీషీటర్లు గంజాయి సేవించి అనేకమందిపై దాడులకు సైతం పాల్పడ్డారు. పోస్ట్ ఆఫీస్‌కి చెందిన ముగ్గురు వ్యక్తులు గంజాయి సేవించి అటుగా వెళ్తున్న వ్యక్తిని పిలిచి విచక్షణారహితంగా దాడి చేయడంతో పాటు సిగరెట్లతో కాల్చి అక్కడి నుండి పారిపోయారు. ఈ విషయం బయటికి చెబితే చంపేస్తామంటూ బాధితుడిని బెదిరించారు. ఈ విషయం తెలుసుకున్న ఒకటో పట్టణ సీఐ సత్యనారాయణ.. కేసు విచారణ చేపట్టి నిందితులపై కేసు నమోదు చేశారు. ఇదే కాకుండా గత వారం మరో వ్యక్తిపై దాడి చేస్తే కేసు పెడతామని స్టేషన్‌కు వచ్చే లోపే కొంతమంది కుల సంఘాల పెద్దలు వారి మధ్య రాజీ కుదిర్చినట్టు సమాచారం.
అధికార పార్టీ అండ దండలు ఉన్నాయంటూ చలామణి..
గంజాయి అక్రమ వ్యాపారం చేస్తున్న రౌడీషీటర్లకు అధికార పార్టీ అండదండలు ఉన్నాయని పట్టణంలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ గంజాయికి అధికార పార్టీ పెద్దలకు ఎటువంటి సంబంధం లేకున్నా రౌడీషీటర్లు మాత్రం నేను ఫలానా అన్న మనిషిని నా జోలికి వస్తే మా అన్న ఊరుకోడు అంటూ పబ్లిక్‌లో కలరింగ్ ఇవ్వడంతో నిజమే అనుకున్నా కొంతమంది ఈ పుకారుని షికారు చేస్తున్నారు. ఈ కొంతమంది రౌడీషీటర్లు అధికార పార్టీలో యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు. కానీ, ఈ గంజాయి దందాకి పార్టీ పెద్దలకు ఎటువంటి సంబంధం లేదని అనేక మంది చెబుతున్నారు.
కాలేజీ విద్యార్థులే టార్గెట్..
ఈ గంజాయి వ్యాపారాన్ని మరింత విస్తరింప చేయడానికి అక్రమార్కులు కాలేజీ విద్యార్థులను టార్గెట్ చేస్తున్నారు. విద్యార్థులకు మెల్లగా ధూమపానం అలవాటు చేసి ఆ తర్వాత డబ్బులు ఇచ్చినా, ఇవ్వకున్నా గంజాయి మత్తుకు బానిసలుగా చేస్తున్నారు. దీంతో ఒకసారి గంజాయి మత్తుకు అలవాటు పడ్డ యువత గంజాయి కొనుగోలు చేయడానికి డబ్బు కోసం ఎంత రిస్క్ అయినా చేస్తున్నారు. తల్లిదండ్రుల దగ్గర నుండి పాకెట్ మనీగా తీసుకున్న డబ్బులు సరిపోక స్థాయిని మించి అప్పులు చేస్తూ, అవీ కూడా సరిపోకపోవడంతో చదువుకునే పుస్తకాలు సైతం అమ్మి గంజాయి సేవిస్తున్నారు. ఈ వ్యసనానికి పూర్తి బానిసగా మారిన వీరు పని చేయలేక, చదువుకోలేక మానసిక దృఢత్వాన్ని కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడి విలువైన నిండు జీవితాన్ని అర్ధాంతరంగానే ముగిస్తున్నారు.
గంజాయిపై ఈ మధ్యకాలంలో జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఆదేశాల మేరకు గంజాయి రవాణాపై కన్నేసిన పోలీసు యంత్రాంగం భారీ స్థాయిలోనే దాడులు నిర్వహించింది. కేసులు నమోదు చేసింది. కానీ, ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా పట్టుబడ్డ నిందితులపై కేవలం కేసులు మాత్రమే పెట్టడంతో భయం లేకుండా పోతోంది.
గంజాయి రవాణాపై ఎస్పీ సునీల్ దత్ ఆదేశాల మేరకు జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్ట నిఘా ఏర్పాటు చేసింది. గంజాయిని విక్రయించే వారిపై, సేవించే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటాం. తల్లిదండ్రులు విద్యార్థులపై ఓ కన్నేసి ఉంచడం మంచిది. సరదాకు అలవాటు చేసుకున్న చెడు వ్యసనాలు నిండు జీవితాన్ని నాశనం చేస్తాయి. పట్టణ ప్రజలకు.. గంజాయి అమ్ముతున్నట్టు తెలిసినా, సేవిస్తున్నట్లు కనిపించినా పోలీసులకు సమాచారం అందించండి. గతంతో పోలిస్తే ప్రస్తుతం గంజాయి రవాణాని చాలా వరకు అదుపు చేశాం.
-డీఎస్పీ వెంకటేశ్వర బాబు.