చైర్మన్ రేసులో..‘ఆ నలుగురు’

by Shyam |   ( Updated:2020-02-22 06:59:10.0  )
చైర్మన్ రేసులో..‘ఆ నలుగురు’
X

దిశ, మెదక్ : జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(డీసీసీబీ) పాలకవర్గ ఎన్నికకు షెడ్యూల్ వెలువడింది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి జిల్లా సహకార ఎన్నికల అధికారులు శనివారం నోటిఫికేషన్ జారీ చేయనున్న నేపథ్యంలో ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పీఠం ఎవరికి దక్కుతుందనే విషయం ఆసక్తిగా మారింది.

సీఎం కేసీఆర్, ఆర్థిక మంత్రి హరీష్ రావు ఈ జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తుండటమే ఇందుకు కారణం. జిల్లాలో అత్యధికంగా పీఏసీఎస్ చైర్మన్లు దక్కించుకున్న టీఆర్‌ఎస్ పార్టీయే ఉమ్మడి జిల్లా డీసీసీబీని సైతం కైవసం చేసుకోనుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాగా డీసీసీబీ చైర్మన్ పదవి కోసం ఆశావహుల సంఖ్య ఎక్కువగానే ఉన్నా.. ములుగు నుంచి గెలుపొందిన అంజిరెడ్డి, కొండపాక నుంచి గెలుపొందిన చిట్టి దేవేందర్‌రెడ్డి , మిరుదొడ్డి నుంచి గెలుపొందిన బక్కి వెంకటయ్య, రామాయంపేట (కోనాపూర్ ) నుంచి గెలుపొందిన ఎం. దేవేందర్‌రెడ్డి ప్రధానంగా రేసులో ఉన్నారు. ఈ నలుగురికీ సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితులనే పేరుండటం గమనార్హం.

వీరిలో అంజిరెడ్డి.. ఎర్రవెల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో పనులన్నీ చక్కబెడుతుంటాడు. ఆయనకు నమ్మకస్తుడుగా పేరు తెచ్చుకున్న అంజిరెడ్డికి ఈ దఫా డీసీసీబీ చైర్మన్ పదవిని కట్టబెడతానంటూ కేసీఆర్ మాటిచ్చినట్టు ప్రచారం సాగుతోంది. ఇక మొన్నటి వరకు ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ చైర్మన్‌గా పని చేసిన చిట్టి దేవేందర్ రెడ్డికి కూడా సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావుకు అత్యంత సన్నిహితుడనే పేరుంది. పైగా కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్‌కు చెందిన నేత కావడం విశేషం.

ఇక టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్న బక్కి వెంకటయ్య.. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేత. సీఎం కేసీఆర్‌తో నేరుగా వెళ్లి మాట్లాడే స్థాయి ఉండటం.. గతంలో ఆందోల్ టికెట్ ఆశించి భంగపడటంతో ఈసారి డీసీసీబీ చైర్మన్ పదవి ఆశిస్తున్నట్టు సమాచారం. ఇక.. ప్రస్తుతం ఇఫ్కో డైరెక్టర్‌గా ఉన్న దేవేందర్ రెడ్డి సతీమణి మెదక్ ఎమ్మెల్యే పద్మారెడ్డి అన్న విషయం తెలిసిందే.

ఆమెకు తెలంగాణ కేబినెట్‌లో మంత్రి పదవి దక్కవకపోవడంతో ఆమె భర్త దేవేందర్ రెడ్డికి ఈ దఫా డీసీసీబీ చైర్మన్ పదవి కట్టబెట్టాలనే ఆలోచనలో టీఆర్ఎస్ అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా ఎవరి ప్రయత్నాల్లో వారున్నా.. ఇంతకు కేసీఆర్ మదిలో మాత్రం ఎవరున్నారన్నది మాత్రం అంతుచిక్కడం లేదు. డీసీసీబీ చైర్మన్ ఎన్నికకు మరో ఐదు రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో సీఎం కేసీఆర్ ఆశీస్సుల కోసం నేతలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు సమాచారం.

అమ్మాయిలు షాక్..మంచం కింద యువకుడు

Advertisement

Next Story