తగ్గిపోతున్న తల్లీబిడ్డల మధ్య ప్రేమ.. ఆ ఘనత స్మార్ట్‌ఫోన్‌దే!

by Shyam |
Smart phone
X

దిశ, ఫీచర్స్ : మీరు మీ స్మార్ట్‌ఫోన్‌కు బానిసలై, విరివిగా ఉపయోగిస్తున్నారా? అవుననేది మీ సమాధానమైతే.. వీలైనంతగా మీరు ఆ అలవాటును తగ్గించుకోవడం మంచిది. ముఖ్యంగా తల్లిదండ్రులు ఈ విషయంలో రైట్ డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. పేరెంట్స్ ఎక్కువగా స్మార్ట్‌ఫోన్స్ ఉపయోగించడం వారి పిల్లల అభివృద్ధికి అంతరాయం కలిగిస్తుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. చైల్డ్ డెవలప్‌మెంట్ జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనం.. స్మార్ట్‌ఫోన్స్ విస్తృతంగా ఉపయోగించినప్పుడు తల్లీబిడ్డల మధ్య పరస్పర చర్య నాలుగు రెట్లు తగ్గుతుందని, ఇది చిన్నారుల డెవలప్‌మెంట్‌పై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని వివరించింది.

ఇజ్రాయెల్‌లోని స్టాన్లీ స్టీయర్ స్కూల్ ఆఫ్ హెల్త్ ప్రొఫెషన్స్‌లోని కమ్యూనికేషన్ డిజార్డర్స్ విభాగానికి చెందిన డాక్టర్ కాటి బోరోడ్కిన్ నేతృత్వంలోని పరిశోధకుల బృందం 33 మంది ఇజ్రాయెల్ తల్లులపై అధ్యయనం చేసింది. ఇందుకోసం ఫోన్ వాడటం వల్ల ఆ తల్లులు తమ పసిబిడ్డల(24-36 నెలల మధ్య) విషయంలో ఎలా వ్యవహరించారో గమనించారు. అధ్యయనంలో భాగంగా ఫేస్‌బుక్ పేజీని బ్రౌజ్ చేయమని, వారికి ఆసక్తి ఉన్న కంటెంట్‌ను ‘లైక్’ చేయమని, మ్యాగజైన్స్ చదవమని, ఆసక్తికరమైన కథనాలను గుర్తించమని కోరారు.

అంతేకాదు ఫోన్స్, మ్యాగజైన్స్‌ను వేరే గదిలో ప్లేస్ చేసి, మరొక గదిలో వారి పిల్లలతో ఆడుకోవాలని కోరారు. ప్రయోగం ఉద్దేశం గురించి తల్లులకు తెలియకపోగా వాళ్లు రోజువారీ జీవితంలో ఎలా ఉంటారో అలానే సహజంగా జీవించారు. కాబట్టి వారి పసిబిడ్డలు, స్మార్ట్‌ఫోన్, మ్యాగజైన్‌ల మధ్య వారి ఆసక్తిని విభజించడం ద్వారా సహజంగా ప్రవర్తించారు. తల్లులు పసిబిడ్డల మధ్య జరిగే అన్ని పరస్పర చర్యల వీడియో రికార్డ్ చేయగా, తల్లీ-పిల్లల పరస్పర చర్యలను లెక్కించే ప్రయత్నంలో రికార్డింగ్‌ను ఫ్రేమ్‌ల వారీగా స్కాన్ చేశారు.

పరిశోధనా బృందం తల్లీబిడ్డల మధ్య పరస్పర చర్యకు సంబంధించిన మూడు అంశాలను నిర్వచించింది

* మెటర్నల్ లింగ్విస్టిక్ ఇన్‌పుట్- తల్లి.. బిడ్డకు తెలియజేసే భాషాపరమైన కంటెంట్.

* కన్వెన్షనల్ టర్న్స్ – తల్లీపిల్లల మధ్య మౌఖిక మార్పిడి(వర్బల్ ఎక్స్‌చేంజ్) పరస్పర చర్య స్థాయి,

* తల్లి ప్రతిస్పందన- తన బిడ్డ స్పందనలకు తల్లి ప్రతిస్పందన

పసిపిల్లల అమ్మలు.. స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగిస్తున్నప్పుడు లేదా మ్యాగజైన్ చదువుతున్నప్పుడు తల్లి-పిల్లల మధ్య పరస్పర చర్య ఈ మూడు అంశాల్లో రెండు – నాలుగు రెట్లు తక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు. అంతేకాకుండా వారు పసిబిడ్డతో తక్కువ వర్బల్ ఎక్స్‌చేంజ్ జరిపినట్లు గుర్తించారు. తక్షణ ప్రతిస్పందనలు తగ్గిపోగా, తరచుగా పిల్లల సంభాషణను పట్టించుకోలేదని అధ్యయనం పేర్కొంది. తల్లి స్మార్ట్‌ఫోన్ వినియోగం పిల్లలపై రేడియేషన్ ప్రభావం చూపడమే కాదు, తల్లీబిడ్డల ప్రేమ పూర్వకమైన బంధంపైన కూడా దాని ప్రభావం చూపుతుందని తెలిపింది. ఏది ఏమైనప్పటికీ, స్మార్ట్‌ఫోన్ వాడకం పిల్లల అభివృద్ధిని ప్రభావితం చేస్తుందనే వాదనకు మద్దతు ఇవ్వడానికి ప్రస్తుతం ఎటువంటి ఆధారాలు లేవని కూడా పేర్కొంది. ఇది ఓ అధ్యయనం మాత్రమేనని, మరిన్ని పరిశోధనల్లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశమున్నట్లు పరిశోధకుల బృందం పేర్కొంది.

‘మా ప్రస్తుత పరిశోధనలో మేము తల్లులపై దృష్టి సారించాము. అయితే మా పరిశోధనలు తండ్రులు, వారి పసిబిడ్డల మధ్య కమ్యూనికేషన్ విషయంలోనూ ఇలాంటి అంశాలే రిపీట్ అవుతాయని మేము నమ్ముతున్నాము. ఎందుకంటే స్మార్ట్‌ఫోన్ వినియోగ విధానాలు పురుషులు, స్త్రీల మధ్య సమానంగా ఉంటాయి. తద్వారా అధిక సంభావ్యతతో అంచనా వేసేందుకు మాకు వీలు కల్పిస్తుంది. పరిశోధనా ఫలితాలు తండ్రులు, తల్లులకు వర్తిస్తాయి. నిజ జీవితంలో తల్లి తన బిడ్డను చూసుకోవాల్సిన పరిస్థితులను ఉన్నతంగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం’ అని పరిశోధకులు తెలిపారు.

Advertisement

Next Story