క్యాంపుల ‘మధ్య’ రాజకీయం

by Shamantha N |   ( Updated:2020-03-11 04:52:52.0  )
క్యాంపుల ‘మధ్య’ రాజకీయం
X

దిశ, వెబ్‌డెస్క్: జ్యోతిరాదిత్య సింధియా రాజీనామా తర్వాత అతని మద్దతుదారులు 22 మంది ఎమ్మెల్యేల రిజైన్‌తో మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్ సర్కారు సంక్షోభంలో పడిపోయింది. జ్యోతిరాదిత్య సింధియా రిజైన్‌కు ముందు నుంచే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను క్యాంపులకు తరలించే కార్యానికి బీజేపీ తెరతీసింది. బీజేపీ పాలిత హర్యానాలోని గురుగ్రామ్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తొలుత తరలించింది. అప్పుడు కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌లాంటి వారు నేరుగా ఎమ్మెల్యేలున్న హోటల్‌కు వెళ్లి.. పార్టీనీ ఒడ్డునేశారు. కానీ, జ్యోతిరాదిత్య సింధియా రాజీనామాతో పరిస్థితులు చేజారిపోయాయి.

సింధియా రాజీనామాకు ముందే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీ ఆ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకకు తరలించింది. తమకేమీ సంబంధం లేదని చెబుతూనే తరలించిన ఎమ్మెల్యేల రాజీనామా లేఖలను స్వయంగా స్పీకర్‌కు అందజేయడం విశేషం. కాగా, తమ సర్కారుకు ఢోకా లేదనీ, మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ తగిన జవాబిస్తాడని కాంగ్రెస్ నేతలు చెప్పడంతో బీజేపీ మరింత జాగ్రత్త పడింది. తమ పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ పాలిత హర్యానాకు తరలించింది. గురుగ్రామ్‌లోని ఐటీసీ గ్రాండ్ హోటల్‌కు పంపించింది. కాగా, కాంగ్రెస్ ఇప్పుడున్న ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్తాన్‌లోని జైపూర్‌కు తరలించింది. అయితే, 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు గానీ, బీజేపీలో చేరేందుకు సుముఖంగా లేరని తెలుస్తున్నది. కేవలం తమ ప్రియతమ నేత సింధియాకు మద్దతుగానే ఈ నిర్ణయం తీసుకున్నామని సుమారు 10 మంది ఎమ్మెల్యేలు పేర్కొన్నట్టు సమాచారం.

Tags: congress, bjp, mla, jyothiradithya scindia, political camps

Advertisement

Next Story

Most Viewed