పశు, మత్స్యశాఖలో ఉద్యోగ ఖాళీల లెక్క తేల్చండి

by Shyam |
పశు, మత్స్యశాఖలో ఉద్యోగ ఖాళీల లెక్క తేల్చండి
X

దిశ, తెలంగాణ బ్యూరో: పశు, మత్స్య శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల లెక్కతేల్చాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బంది వివరాలను కూడా సమగ్ర నివేదిక రూపంలో అందిచాలని తెలిపారు. శుక్రవారం మాసబ్‌ట్యాంక్ లో తన కార్యాలయంలో పశు, మత్స్యశాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్టాడుతూ నూతనంగా ఏర్పడిన జిల్లాలు, మండలాలను దృష్టిలో ఉంచుకొని అందుకు అనుగుణంగా నివేదికలను సిద్ధం చేయాలని సూచించారు.

ఇటీవల అమలులోకి వచ్చిన నూతన జోనల్ విధానంతో కూడా ఏర్పడే ఖాళీలను గుర్తించి నివేదికలో పొందుపరచాలని చెప్పారు. ఆయా శాఖలలోని ఖాళీలను గుర్తించి వాటిని భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని మంత్రి శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం రిటైర్ అయ్యే ఉద్యోగులతో ఖాళీ అయ్యే పోస్టులను అదే సంవత్సరం భర్తీ చేసేందుకు సీఎం కేసిఆర్ కార్యాచరణను రూపొందిస్తున్నారని తెలిపారు. జాబ్ క్యాలెండర్ అమలుతో ప్రభుత్వం పై ఆర్థికంగా ఎంతో భారం పడుతుందని, అయినా ముఖ్యమంత్రి ఎంతో సాహసంతో ముందుకు వెళుతున్నారని పేర్కొన్నారు.

పలు పట్టణాల్లోని పశువైద్యశాలలకు వైద్య సేవల కోసం ఎలాంటి జీవాలు రావడం లేదని, అలాంటి హాస్పిటల్స్ లో ఉన్న సిబ్బందిని, వివిధ హాస్పిటల్స్‌లో అదనంగా ఉన్న సిబ్బందిని అవసరమైన చోటకు బదిలీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర, మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా, గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య ఎండీ రాంచందర్, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ లక్ష్మారెడ్డి ఇతరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed