బంగారం కంటే ఇళ్లే ముఖ్యమంటున్న మహిళలు

by Harish |   ( Updated:2024-03-08 09:20:42.0  )
బంగారం కంటే ఇళ్లే ముఖ్యమంటున్న మహిళలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: సాధారణంగా మహిళలకు బంగారం అంటే చాలా ఇష్టం. పండుగలు, శుభకార్యాలకు బంగారాన్ని ధరించడానికి ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. అలాగే, ఇన్వెస్ట్‌మెంట్ పరంగా కూడా ఇది ఉపయోగపడుతుంది. అయితే ఇటీవల కాలంలో మహిళల అభిరుచుల్లో చాలా మార్పులు వచ్చాయి. భారతీయ మహిళలు బంగారంపై పెట్టుబడులు పెట్టడం కంటే అధిక రాబడి ఇచ్చే రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేయడానికి చాలా ఆసక్తిగా ఉన్నట్లు ఒక సర్వే పేర్కొంది.

ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ అనరాక్ విడుదల చేసిన డేటా ప్రకారం, 80 శాతం మంది మహిళలు తుది ఉపయోగం కోసం ఇళ్లను కొనుగోలు చేయాలనుకుంటున్నారు. 60 శాతం కంటే ఎక్కువ మహిళలు ఇప్పుడు గృహాలను పెట్టుబడి అంశంగా చూస్తున్నారు. రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా బంగారం కంటే ఎక్కువ రాబడిని పొందవచ్చని వారి అభిప్రాయం. అలాగే, 16 శాతం మంది మహిళలు స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులను ఇష్టపడుతున్నారు. కేవలం 14 శాతం మంది మాత్రమే బంగారంపై పెట్టుబడికి ఆసక్తి కలిగి ఉన్నారు.

ముఖ్యంగా, 57 శాతం మంది మహిళలు 3BHKల కోరుకుంటుండగా, 29 శాతం మంది 2BHKలను ఇష్టపడుతున్నారు. అలాగే, రూ.45 లక్షల నుంచి రూ.1.5 కోట్ల మధ్య మధ్య ప్రీమియం సెగ్మెంట్ ఇళ్లను ఎక్కువగా ఎంచుకోగా, 23 శాతం మంది మహిళలు రూ.1.5 కోట్ల కంటే ఎక్కువ ధర కలిగిన లగ్జరీ ఇళ్లను కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు. ఇళ్లను కొనుగోలు చేయాలని చూస్తున్న వారిలో 24 శాతం మంది ఇప్పుడు ప్రారంభించిన ప్రాపర్టీలను ఇష్టపడుతుండగా, 15 శాతం మంది కొత్తగా వచ్చే ప్రాజెక్ట్‌లలో ఇళ్లను కోరుకుంటున్నారని సర్వే వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed