Air India: నవంబర్‌ 11న విస్తారా చివరి విమానం

by Harish |   ( Updated:2024-08-30 07:08:17.0  )
Air India: నవంబర్‌ 11న విస్తారా చివరి విమానం
X

దిశ, బిజినెస్ బ్యూరో: టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియాలో విస్తారాను విలీనం చేసే ప్రక్రియలో భాగంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కోసం భారత ప్రభుత్వం నుంచి సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు అనుమతి లభించింది. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియాలో విలీనానికి ముందు నవంబర్ 11న విస్తారా చివరి విమానం నడపనుంది. ఆ తేదీ తర్వాత విమాన కార్యకలాపాలు అన్ని కూడా ఎయిర్ ఇండియా పరిధిలోకి వెళ్లనున్నాయి. సెప్టెంబర్ 3 నుంచి విస్తారాలో బుకింగ్‌లు, ఇతర అన్ని సేవలు కూడా అందుబాటులో ఉండవు, వాటన్నింటిని ఎయిర్ ఇండియా యాజమాన్యం నిర్వహిస్తుంది. చివరి తేదీ లోపు మాత్రం విస్తారా తన సేవలను యథావిధిగా అందిస్తుంది.

ఎయిర్ ఇండియాలో-విస్తారా విలీనం 18 నెలలకు పైగా జరుగుతోంది. విస్తారా సంస్థ టాటా, సింగపూర్ ఎయిర్‌లైన్స్ మధ్య 51:49 జాయింట్ వెంచర్‌గా ఉంది. అయితే విస్తారాను విలీనం చేసుకోవాలంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కింద ఎయిర్ ఇండియాలో సింగపూర్ ఎయిర్‌లైన్స్ కొన్ని వాటాలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అయితే దీనికి భారత ప్రభుత్వం నుంచి అనుమతి తప్పనిసరి. ఈ నేపథ్యంలో ఎఫ్‌డీఐపై ప్రభుత్వ అనుమతిని కోరగా, తాజాగా దానికి ఆమోదం లభించడంతో సింగపూర్ ఎయిర్‌లైన్స్, ఎయిర్ ఇండియాలో కొన్ని వాటాలు కొనుగోలు చేయడానికి అవకాశం లభించింది. దాదాపు ఈ పెట్టుబడి విలువ $276 మిలియన్ల వరకు అని అంచనా. ఈ డీల్ తరువాత ఎయిర్ ఇండియాలో సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ 25.1 శాతం వాటా ఉంటుంది. ఎయిర్ ఇండియా విస్తారాతో విలీనాన్ని ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలని సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ భావిస్తుంది.

Advertisement

Next Story

Most Viewed