జూలై-సెప్టెంబర్ 3 శాతం క్షీణించిన అమ్ముడుపోని ఇళ్లు!

by Vinod kumar |
జూలై-సెప్టెంబర్ 3 శాతం క్షీణించిన అమ్ముడుపోని ఇళ్లు!
X

న్యూఢిల్లీ: ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ మధ్య దేశీయంగా ప్రధాన నగరాల్లో విక్రయించని ఇళ్ల సంఖ్య 3 శాతం తగ్గి 5.08 లక్షల యూనిట్లకు పడిపోయాయి. అంతకుముందు త్రైమాసికంతో పోలిస్తే సరఫరా కంటే అమ్మకాలు ఎక్కువగా జరిగాయి. ప్రముఖ డేటా అనలిటిక్ సంస్థ ప్రాప్ఈక్విటీ తాజా నివేదిక ప్రకారం, ఈ ఏడాది జూన్ నాటికి 5,26,497 యూనిట్ల ఇళ్లు ఉండగా, సెప్టెంబర్ చివరికి 5,08,464 యూనిట్లకు తగ్గాయి. ప్రధాన తొమ్మిది నగరాల్లో 1,15,904 యూనిట్ల అమ్మకాలు జరగ్గా, అందులో కొత్తవి 97,871 యూనిట్లుగా ఉన్నాయి. దీంతో అమ్ముడుపోని ఇళ్ల సంఖ్య పడిపోయాయి.

దేశంలోని ప్రధాన నగరాల్లో ఇళ్ల ధరలు పెరుగుతున్నాయి. అయినప్పటికీ స్థిరాస్తి రంగంలో ఇప్పటికీ ధరలు ఆకర్షణీయంగా ఉండటంతో అమ్ముడుపోనీ ఇళ్ల సంఖ్య తగ్గుతున్నాయని ప్రాప్ఈక్విటీ వ్యవస్థాపకుడు సమీర్ జసుజా అన్నారు. నివేదిక ప్రకారం, హైదరాబాద్‌లో అమ్ముడుపోని ఇళ్ల సంఖ్య జూన్ తర్వాత 6 శాతం పెరిగి 1.05 లక్షల యూనిట్లకు చేరాయి. ఆ తర్వాత బెంగళూరులో 1 శాతం పెరిగి 54,404 యూనిట్లకు, నవీ ముంబైలోనూ 1 శాతం పెరిగి 34,983 యూనిట్లకు చేరాయి. థానేలో 6 శాతం తగ్గి 1.04 లక్షలు, పూణెలో 10 శాతం క్షీణించి 71,220, ముంబైలో 4 శాతం తగ్గి 61,142, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో 7 శాతం తగ్గి 37,356, చెన్నైలో 7 శాతం తగ్గి 20,048, కోల్‌కతాలో 9 శాతం పడిపోయి 19,112 యూనిట్లకు చేరాయి.

Advertisement

Next Story