రూ.200 LPG సబ్సిడీకి ఎవరు అర్హులో తెలుసా!

by Harish |
రూ.200 LPG సబ్సిడీకి ఎవరు అర్హులో తెలుసా!
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందిస్తోంది. కానీ ఇటీవల కేంద్ర ప్రభుత్వం సబ్సిడీని అందరికీ కాకుండా పరిమిత స్థాయిలో ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఇప్పుడు ఈ పథకం కింద దాదాపు తొమ్మిది కోట్ల మంది పేద మహిళలు, ఇతర లబ్ధిదారులకు వంట గ్యాస్‌పై రూ. 200 సబ్సిడీ అందిస్తున్నట్లు పేర్కొంది. ఇటీవల కాలంలో వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగాయి. ఇంతకుముందు ప్రభుత్వం గ్యాస్ సబ్సిడీని తెల్లరేషన్ కార్డుదారులందరికీ ఇచ్చింది. ప్రభుత్వం మీద సబ్సిడీ భారం అధికం కావడం వలన ఇప్పుడు కొందరికి మాత్రమే ఈ పథకాన్ని వర్తింప చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ పథకంలో లేని మిగతా వారు మాత్రం మార్కెట్ రేట్ ప్రకారం గ్యాస్ ధరలు చెల్లించాలని ప్రభుత్వం తెలిపింది.

LPG సబ్సిడీ తెల్ల రేషన్ కార్డు ఉన్న అందరికీ కాకుండా SC, ST కుటుంబాలు, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ), అత్యంత వెనుకబడిన తరగతులు, అంత్యోదయ అన్న యోజన (AAY), 14-పాయింట్ డిక్లరేషన్ ప్రకారం పేద కుటుంబాలు మాత్రమే ఈ సబ్సిడీకి అర్హులు. ఒకవేళ ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద ఉచిత గ్యాస్ కనెక్షన్లు పొందాలనుకునే వారు తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి. దరఖాస్తుదారు 18 ఏళ్లు నిండి ఉండాలి. ఇంట్లో ఏ ఇతర LPG కనెక్షన్‌లు ఉండకూడదు. సబ్సిడీ కోసం అప్లై చేసుకున్నవారి పత్రాలను సంబంధిత గ్యాస్ ఏజెన్సీ అధికారులు పరిశీలించి ప్రభుత్వానికి పంపిస్తారు. ప్రస్తుతం మార్కెట్ ధర ప్రకారం 14.2కిలోల LPG సిలిండర్ ధర వేయి రూపాయల పైన ఉంది. ప్రభుత్వ నిర్ణయం తర్వాత, ప్రధాన మంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు, సిలిండర్‌కు రూ. 200 సబ్సిడీ నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు జమ చేయబడుతుంది.

Advertisement

Next Story