అత్యధిక బంగారు నిల్వలున్న దేశాల్లో భారత్ స్థానం ఎంతంటే..

by S Gopi |   ( Updated:2024-01-18 12:16:23.0  )
అత్యధిక బంగారు నిల్వలున్న దేశాల్లో భారత్ స్థానం ఎంతంటే..
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఒక దేశం యొక్క ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించడంలో బంగారు నిల్వలు కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా ఆర్థిక అనిశ్చితి నెలకొన్న సమయాల్లో నమ్మకమైన నిల్వలుగా ఇవి పనిచేస్తాయి. అందుకే ప్రతీ దేశం బంగారాన్ని నిల్వ చేసుకునేందుకు ప్రాధాన్యత ఇస్తాయి. అవసరమైతే వాటిని పెంచుకునేందుకు ప్రయత్నిస్తాయి. ఒక దేశ కరెన్సీ విలువను కూడా బంగారం నిల్వలు ప్రభావితం చేస్తాయి. ఈ క్రమంలో అత్యధిక బంగారం నిల్వలు ఉన్న దేశాల జాబితాను తాజాగా ఫోర్బ్స్ ప్రకటించింది.

1970లలో అధికారికంగా రద్దు చేసినప్పటికీ, అనేక దేశాలు ఇప్పటికీ బంగారు నిల్వలను కొనసాగిస్తున్నాయి. ఇప్పుడు పెరుగుతున్న ఆర్థిక అనిశ్చితి కారణంగా ఈ నిల్వలకు డిమాండ్ పెరుగుతోంది. సెంట్రల్ బ్యాంకులు మరోసారి బంగారానికి తొలి సురక్షిత ఆస్తిగా పరిగణిస్తున్నాయి. ఆధునిక ఆర్థిక రంగం మారుతున్నప్పటికీ, బంగారం నిల్వలు దేశ క్రెడిట్ యోగ్యత, మొత్తం ఆర్థిక స్థితిని ప్రభావితం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఫోర్బ్స్ ప్రకారం, అత్యధిక బంగారు నిల్వలు కలిగిన టాప్ 10 దేశాల జాబితాలో భారత్ 800.78 టన్నులతో తొమ్మిదవ స్థానంలో నిలిచింది. దేశంలో బంగారం నిల్వల విలువ రూ. 4 లక్షల కోట్లకు పైమాటే. ఇక, ఈ జాబితాలో అగ్రరాజ్యం అమెరికా ప్రపంచంలోనే అత్యధికంగా 8,133.46 టన్నుల బంగారు నిల్వలతో మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత జర్మనీ(3,352.65 టన్నులు), ఇటలీ(2,451.84 టన్నులు), ఫ్రాన్స్(2,436.88 టన్నులు), రష్యా(2,332.74 టన్నులు), చైనా(2,191.53 టన్నులు), స్విట్జర్లాండ్(1,040 టన్నులు), జపాన్(845.97 టన్నులు), నెదర్లాండ్స్(612.45 టన్నులు)తో మొదటి పది స్థానాల్లో నిలిచాయి.

Advertisement

Next Story