చివరి దశకు బడ్జెట్ రూపకల్పన.. నార్త్ బ్లాక్‌లో హల్వా వేడుకలో ఆర్థిక మంత్రి

by Harish |   ( Updated:2024-07-16 14:03:58.0  )
చివరి దశకు బడ్జెట్ రూపకల్పన.. నార్త్ బ్లాక్‌లో హల్వా వేడుకలో ఆర్థిక మంత్రి
X

దిశ, బిజినెస్ బ్యూరో: మరికొద్ది రోజుల్లో మొదలుకానున్న పార్లమెంట్ సమావేశాల్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 2024 పూర్తి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో బడ్జెట్‌ రూపకల్పన చివరి దశకు చేరుకున్న సందర్బంగా నార్త్‌ బ్లాక్‌లో మంగళవారం సాయంత్రం 'హల్వా’ వేడుకను ఘనంగా నిర్వహించారు. నిర్మలా సీతారామన్ బడ్జెట్ తయారీ ప్రక్రియలో పాల్గొన్న కార్యదర్శులు, అధికారులు, సిబ్బందికి హల్వా పంపిణీ చేశారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ వంటగదిలో హల్వాను తయారు చేశారు. ఈ వేడుకలో ఆర్థిక మంత్రితో పాటు, మంత్రిత్వ శాఖలోని ఇతర సభ్యులు, ఎంఓఎస్ పంకజ్ చౌదరి, సీఈఏ వి అనంత నాగేశ్వరన్, ఆర్థిక కార్యదర్శి టీవీ సోమనాథన్, డీఈఏ కార్యదర్శి అజయ్ సేథ్ తదితరులు పాల్గొన్నారు.

ప్రతిసారీ బడ్జెట్‌కు ముందు సంప్రదాయం ప్రకారం కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయంలో హల్వా వేడుక నిర్వహిస్తారు. బడ్జెట్‌ రూపకల్పనలో పాల్గొనే సిబ్బంది మొత్తం కూడా ఆర్థిక మంత్రి బడ్జెట్‌ను సమర్పించే వరకు అక్కడే ఉంటారు. బడ్జెట్‌ వివరాలు బయటకు రాకూడదన్న ఉద్దేశంతో, వారిని బయటి ప్రపంచంతో కనెక్ట్ కానివ్వరు. వసతి సౌకర్యాలు అక్కడే కల్పిస్తారు. వారు మొబైల్ ఫోన్లను కూడా ఉపయోగించడం కుదరదు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికలకు ముందు ఫిబ్రవరిలో ఆర్థిక మంత్రి సమర్పించిన చివరి బడ్జెట్ ఓట్ ఆన్ అకౌంట్ ది కాగా, ఎన్నికల తరువాత మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పడటంతో ఇప్పుడు పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. ఆర్థిక మంత్రి జులై 23న ఉదయం 11 గంటలకు పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెడతారు.

Advertisement

Next Story

Most Viewed