6G పేటెంట్లపై ప్రభుత్వం కీలక ప్రకటన

by Harish |   ( Updated:2024-08-24 14:20:37.0  )
6G పేటెంట్లపై ప్రభుత్వం కీలక ప్రకటన
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారతీయ టెలికాం కంపెనీలు రానున్న మూడేళ్లలో 6G పేటెంట్లలో 10 శాతం వాటాను సాధించడంతో పాటు ప్రపంచ ప్రమాణాలకు ఆరవ వంతు సహకారాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయని ప్రభుత్వ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. దీనికోసం స్టాండర్డ్స్ కమ్యూనిటీని ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. మరోవైపు 5Gలో దూసుకుపోతున్న భారత్ 6Gని కూడా త్వరగా అందించడానికి దేశీయ టెలికాం కంపెనీలకు మద్దతు ఇస్తుంది. కేంద్రం ఇప్పటికే పేటెంట్, ఐపీఆర్ సపోర్ట్ ఫ్రేమ్‌వర్క్, టెస్ట్‌బెడ్‌ల కమీషన్‌తో పాటు 'భారత్ 6G విజన్', 'భారత్ 6G అలయన్స్' వంటి వివిధ కార్యక్రమాలను మొదలుపెట్టింది.

శుక్రవారం కేంద్ర టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అధ్యక్షతన జరిగిన టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ (టీఎస్‌పీ) మొదటి సమావేశంలో కూడా 6G పై చర్చించారు. ప్రపంచవ్యాప్తంగా నెట్‌వర్క్ కనెక్టివిటీ, వైర్‌లైన్, ఇంటెలిజెంట్ వైర్‌లెస్ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్‌లలో అగ్రగామిగా ఉండటానికి ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలను అందిస్తామని మంత్రి చెప్పారు. ఇదిలా ఉంటే, దేశంలో 100 శాతం బ్రాడ్‌బ్యాండ్ కవరేజీ మార్గంలో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు సపోర్టివ్ పాలసీ ఫ్రేమ్‌వర్క్‌ను అందించాలని టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ ప్రభుత్వాన్ని కోరారు.

Advertisement

Next Story