రెండు కంపెనీలుగా విడిపోతున్న టాటా మోటార్స్

by S Gopi |
రెండు కంపెనీలుగా విడిపోతున్న టాటా మోటార్స్
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ అతిపెద్ద వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాపార కార్యకలాపాలను రెండు వేర్వేరు సంస్థలుగా విభజించేందుకు టాటా మోటార్స్ బోర్డు సోమవారం ఆమోదించింది. ప్రధానంగా సామర్థ్యాన్ని మరింత పటిష్టం చేయడం, అధిక వృద్ధి లక్ష్యాల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ తెలిపింది. డీమెర్జర్‌లో భాగంగా కమర్షియల్ వాహనాలు, సంబంధిత వ్యాపారాలు ఒక సంస్థలో, ఈవీ, జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్, ప్యాసింజర్ వాహనాల వ్యాపారం ఒక సంస్థలో భాగంగా ఉంటాయని కంపెనీ వెల్లడించింది. ఉద్యోగులకు మెరుగైన వృద్ధి అవకాశాలు, షేర్ హోల్డర్ల విలువను పెంపొందించడానికి ఈ విభజన దోహదపడుతుందని చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ఒక ప్రకటనలో చెప్పారు. గత కొన్నేళ్ల నుంచి టాటా మోటార్స్ మూడు విభాగాలు స్వతంత్రంగానే పనిచేస్తున్నాయి. తాజా డీమెర్జర్ దీన్ని మరింత వేగవంతం చేస్తుందని ఆయన వివరించారు. టాటా మోటార్స్ షేర్లు ఉన్న వాటాదారులు రెండు కంపెనీల్లో ఒక్కోటి చొప్పున షేర్ కలిగి ఉంటారని కంపెనీ తెలిపింది. విభజన వల్ల ఉద్యోగులు, కస్టమర్లు, వ్యాపార భాగస్వామూలపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని కంపెనీ భావిస్తోంది.

Advertisement

Next Story