అత్యంత విలువైన కంపెనీల జాబితాలో భారతీయ టాటా గ్రూప్

by S Gopi |
అత్యంత విలువైన కంపెనీల జాబితాలో భారతీయ టాటా గ్రూప్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాదికి సంబంధించి ప్రపంచంలోనే అత్యంత విలువైన బ్రాండ్ టైటిల్‌ను టెక్ దిగ్గజం, ఐఫోన్ కంపెనీ యాపిల్ సొంతం చేసుకుంది. 517 బిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో కంపెనీ అగ్రస్థానాన్ని దక్కించుకోగా, గతేడాది కంటే ఈసారి కంపెనీ 73.6 శాతం విలువను పెంచుకుంది. యాపిల్‌తో పాటు ప్రపంచ విలువైన బ్రాండ్ల జాబితాలో ఎక్కువగా అమెరికా కంపెనీలే ఉండటం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా అత్యంత విలువైన బ్రాండ్లలో టాప్ 10 జాబితాలో ఆరు, టాప్ 100లో 51 అమెరికా కంపెనీలు ఉన్నాయి. తాజాగా విడుదలైన బ్రాండ్ ఫైనాన్స్ నివేదికలో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల బ్రాండ్ విలువ ఆధారంగా ర్యాంకింగ్స్ వెలువడ్డాయి. మార్కెట్ విలువ కంటే బ్రాండ్‌కు ఉన్న సామర్థ్యం, ఆర్థిక పనితీరు ఆధారంగా ఈ జాబితా రూపొందించారు. టాటా గ్రూప్ సంస్థ 29 బిలియన్ డాలర్లతో ఏకైక భారతీయ సంస్థగా నిలిచింది. ఇక, 99 బిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో దక్షిణ కొరియాకు చెందిన శాంసంగ్ రెండో స్థానంలో నిల్వగా, చైనాకు చెందిన టిక్‌టాక్ 84 బిలియన్ డాలర్లతో మూడో స్థానంలో ఉంది. అనంతరం 73 బిలియన్ డాలర్లతో జర్మనీకి చెందిన డయీష్ టెలికాం, జపాన్‌కు చెందిన టయోటా(53 బిలియన్ డాలర్లు), యూకేకు చెందిన షెల్(50 బిలియన్ డాలర్లు), సౌదీ అరేబియాకు చెందిన సౌదీ అరామ్‌కో(42 బిలియన్ డాలర్లు), ఫ్రాన్స్‌కు చందిన లూయిస్ విట్టన్(32 బిలియన్ డాలర్లు) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. స్విట్జర్లాండ్‌కు చెందిన నెస్లె 21 బిలియన్ డాలర్ల బ్రాండ్ విలువను కలిగి ఉంది.

Advertisement

Next Story