Ford Motors: భారత్‌లో మళ్లీ తయారీని ప్రారంభించనున్న ఫోర్డ్ మోటార్స్

by S Gopi |
Ford Motors: భారత్‌లో మళ్లీ తయారీని ప్రారంభించనున్న ఫోర్డ్ మోటార్స్
X

దిశ, బిజినెస్ బ్యూరో: రెండేళ్ల క్రితం భారత కార్యకలాపాలను నిలిపేసిన ప్రముఖ వాహన తయారీ సంస్థ ఫోర్డ్ మోటార్స్ తిరిగి దేశ మార్కెట్లో రీ-ఎంట్రీ ఇవ్వనుంది. ముఖ్యంగా ఎగుమతులపై దృష్టి సారిస్తూ చెన్నైలో ఉన్న తమ మరైమలై నగర్‌లోని ప్లాంటును పునఃప్రారంభించేందుకు తమిళనాడు ప్రభుత్వంతో కంపెనీ చర్చలు జరుపుతోంది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌ను కలిసి అవసరమైన చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. తమిళనాడుతో ఫోర్డ్‌కు ఉన్న మూడు దశాబ్దాల భాగస్వామ్యాన్ని పునఃప్రారంభించేందుకు, ఇక్కడి నుంచే అంతర్జాతీయ మార్కెట్‌కు ఫోర్డ్ వాహనాలను ఎగుమతి చేయడానికి అవసరమైన సాధ్యాసాధ్యాలపై చర్చిస్తున్నట్టు ఎంకె స్టాలిన్ ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఇదే సమయంలో కంపెనీ గ్లోబల్ టెక్నాలజీ సెంటర్‌ను విస్తరించాలని స్టాలిన్ కంపెనీని కోరారు. ఈ ఏడాది ప్రారంభంలో కంపెనీ భారత మార్కెట్లో అమ్మకాలను తిరిగి ప్రారంభిస్తుందనే కథనాలు వచ్చాయి. దేశీయ వాహన మార్కెట్లో ఎస్‌యూవీ మోడల్ కార్లకు అధిక డిమాండ్ ఏర్పడింది. దీంతో ఫోర్డ్ తన ప్రీమియం ఎస్‌యూవీ మోడల్ ఎండీవర్‌ను మళ్లీ మార్కెట్లో విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. అదే సమయంలో ఫోర్డ్‌ సీవోవోగా భారత్‌కు చెందిన కుమార్‌ గల్హోత్రాను నియమించడం కూడా కంపెనీ రీ-ఎంట్రీ ఊహాగానాలకు బలం చేకూర్చింది.

Advertisement

Next Story

Most Viewed