లాంచ్ అయిన దేశంలోనే తొలి ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ ఏసీ బస్సు

by Harish |   ( Updated:2022-08-18 10:35:34.0  )
లాంచ్ అయిన దేశంలోనే తొలి ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ ఏసీ బస్సు
X

ముంబై: అశోక్ లేలాండ్ ఎలక్ట్రిక్ వాహనాల విభాగం స్విచ్ మొబిలిటీ భారతదేశపు మొట్టమొదటి ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ ఏసీ బస్సును గురువారం ఆవిష్కరించింది. ఈఐవీ 22 పేరుతో తీసుకొచ్చిన ఈ బస్సును మొదటగా ముంబైలో లాంచ్ చేయగా, నగరాల్లో రవాణా సౌకర్యాల కోసం దీన్ని రూపొందించినట్టు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.

డ్యుయెల్ గన్ ఛార్జింగ్ సిస్టమ్‌తో 231 కిలోవాట్ అవర్ బ్యాటరీ సామర్థ్యం కలిగిన బస్సు సిటీ పరిధిలో 250 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని కంపెనీ వివరించింది. ఇప్పటికే ముంబైలో 200 బస్సుల కోసం బృహన్ ముంబై ఎలక్ట్రిసిటీ సప్లై అండ్ ట్రాన్స్‌పోర్ట్(బెస్ట్) నుంచి ఆర్డర్ ఉందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే వీటిలో 50 బస్సులను డెలివరీ చేయనున్నామని స్విచ్ మొబిలిటీ ఇండియా సీఈఓ మహేశ్ బాబు అన్నారు.

దేశంలోని ఇతర కీలక ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ విభాగంలో మరిన్ని బస్సులను తీసుకొచ్చి ఆధిపత్యాన్ని కొనసాగించాలనే లక్ష్యంతో ఉన్నామని కంపెనీ వెల్లడించింది. వచ్చే ఏడాది నాటికి మరో 150-250 బస్సులను డెలివరీ చేయనున్నట్లు పేర్కొంది. కాగా, ఈ ఏడాది ఏప్రిల్‌లో స్విచ్ మొబిలిటీ దాదాపు రూ. 2,900 కోట్ల పెట్టుబడులను ప్రకటించింది. వీటితో భారత్‌తో పాటు యూకేలో ఎలక్ట్రిక్ బస్సులను, లైట్ కమర్షియల్ వాహనాల అభివృద్ధికి వాడనున్నట్టు కంపెనీ తెలిపింది.

ఇక, అశోక్ లేలాండ్ సంస్థ 1967 లోనే దేశీయంగా డబుల్ డెక్కర్ బస్సును తీసుకొచ్చింది. అప్పటి వారసత్వాన్ని స్విచ్ మొబిలిటీ కొనసాగించిందని అశోక్ లేలాండ్ అభిప్రాయపడింది.

Advertisement

Next Story

Most Viewed