Swiggy: ఐపీఓకు ముందు 'ఇంటర్నేషనల్ లాగ్-ఇన్' ఫీచర్ ప్రవేశపెట్టిన స్విగ్గీ

by S Gopi |   ( Updated:2024-10-25 12:42:25.0  )
Swiggy: ఐపీఓకు ముందు ఇంటర్నేషనల్ లాగ్-ఇన్ ఫీచర్ ప్రవేశపెట్టిన స్విగ్గీ
X

దిశ, బిజినెస్ బ్యూరో: త్వరలో ఐపీఓకు సిద్ధమవుతున్న ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ 'ఇంటర్నేషనల్ లాగ్-ఇన్' ఫీచర్‌ను శుక్రవారం ప్రవేశపెట్టింది. దీని ద్వారా విదేశాల్లో ఉన్న భారతీయులు తమ కుటుంబసభ్యులు, ఇష్టమైన వారికోసం ఆర్డర్ చేసేందుకు వీలుంటుంది. ఈ సదుపాయం యూఎస్, కెనడా, జర్మనీ, యూకేలతో సహా మొత్తం 27 దేశాల్లో అందుబాటులో ఉండనుంది. ఈ పర్మినెంట్ ఫీచర్ వల్ల విదేశాల్లో ఉన్నవారు ఫుడ్ డెలివరీతో పాటు స్విగ్గీ క్విక్-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టామార్ట్‌ను కూడా యాక్సెస్ చేయవచ్చు. అలాగే స్విగ్గీ యాప్ నుంచి డైన్-ఔట్ ద్వారా టెబుల్ రిజర్వేషన్ చేసేందుకు వీలుంటుంది. వినియోగదారులు ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపులు పూర్తి చేయవచ్చు లేదా అందుబాటులో యూపీఐ ఆప్షన్ ఉపయోగించవచ్చు. విదేశాల్లో ఉన్న వినియోగదారుల నుంచి ఈ ఫీచర్ కోసం డిమాండ్ పెరిగిన నేపథ్యంలో దీన్ని తీసుకొచ్చామని, ముఖ్యంగా పండుగ సీజన్‌లో ఈ ఫీచర్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని స్విగ్గీ సహ-వ్యవస్థాపకుడు ఫణి కిషన్ తెలిపారు. కాగా, ఇటీవలే స్విగ్గీ తన పబ్లిక్ లిస్టింగ్ కోసం సెబీ వద్ద ఐపీఓ పత్రాలను దాఖలు చేసింది. అప్‌డేట్ చేసిన డీఆర్‌హెచ్‌పీ ప్రకారం.. కంపెనీ రూ. 3,750 కోట్ల నిధులను సమీకరించనుంది. స్టాక్ మార్కెట్ల హెచ్చుతగ్గుల కారణంగా తాజాగా కంపెనీ విలువను 15 బిలియన్ డాలర్ల నుంచి 12.5-13.5 బిలియన్ డాలర్లకు సవరించింది.

Advertisement

Next Story

Most Viewed