ICICI : చందాకొచ్చర్‌ దంపతులకు సుప్రీంకోర్టు నోటీసులు

by Harish |
ICICI : చందాకొచ్చర్‌ దంపతులకు సుప్రీంకోర్టు నోటీసులు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఐసీఐసీఐ బ్యాంక్‌ మాజీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ చందా కొచ్చర్‌, ఆమె భర్త దీపక్‌ కొచ్చర్‌‌కు తాజాగా సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. వీడియోకాన్‌ గ్రూప్‌ కంపెనీలకు అక్రమంగా రూ. 3,250 కోట్ల రుణాలను మంజూరు చేశారని గతంలో అరెస్ట్ చేయగా, వీరి అరెస్ట్ అక్రమం అంటూ బాంబే హైకోర్టు ఫిబ్రవరి 6న తీర్పునిస్తూ బెయిల్‌ మంజూరు చేసింది. దీంతో సీబీఐ దీనిని అప్పీల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం విచారణ జరిపిన కోర్టు సీబీఐ పిటిషన్‌పై తమ స్పందన తెలియజేయాలంటూ న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, పీవీ సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం చందాకొచ్చర్‌ దంపతులకు నోటీసులు జారీ చేసింది.

ఇదే కేసులో ఈ ఏడాది ప్రారంభంలో వీడియోకాన్ గ్రూప్ ప్రమోటర్ వేణుగోపాల్ ధూత్‌కు బెయిల్ మంజూరు చేసినందుకు వ్యతిరేకంగా ఏజెన్సీ దాఖలు చేసిన మరో పిటిషన్‌ కూడా పరిగణనలోకి తీసుకుంటామని కోర్టు తెలిపింది. విచారణలో భాగంగా సీబీఐ తరపున హాజరైన అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్‌వి రాజు, హైకోర్టు తీర్పును తప్పుబట్టారు, ఇద్దరి అరెస్టు అన్ని చట్టపరమైన, విధానపరమైన నిబంధనలకు లోబడి జరిగిందని వాదించారు.కేసు విషయానికి వస్తే, ICICI బ్యాంక్ సీఈఓగా చందా కొచ్చర్ నిబంధనలు ఉల్లంఘించి, వేణుగోపాల్ ధూత్ నేతృత్వంలోని వీడియోకాన్ గ్రూప్‌కు రూ.3,250 కోట్ల రుణాలు మంజూరు చేశారని, దీని వల్ల ఆమె కుటుంబం లబ్ధి పొందారని ఆరోపణలు రాగా సీబీఐ కేసు నమోదు చేసింది.

Advertisement

Next Story

Most Viewed