ఎస్‌వీబీ దెబ్బకు పతనమైన స్టాక్ మార్కెట్లు!

by Harish |   ( Updated:2023-03-13 13:40:07.0  )
ఎస్‌వీబీ దెబ్బకు పతనమైన స్టాక్ మార్కెట్లు!
X

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు కుప్పకూలాయి. గత కొన్ని వారాలుగా గ్లోబల్ మార్కెట్ల ప్రభావంతో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న సూచీలు తాజాగా అమెరికాకు చెందిన సిలికాన్ వ్యాలీ బ్యాంకు సంక్షోభానికి తోడు, మరో సిగ్నేచర్ బ్యాంకు కూడా మూతపడటంతో పెట్టుబడిదారుల సెంటిమెంట్ దెబ్బతిన్నది. అంతర్జాతీయ మార్కెట్లో ప్రతికూల సంకేతాలున్నప్పటికీ సోమవారం ఉదయం కొద్దిసేపు మన మార్కెట్లు లాభాల్లో కదలాడాయి. అయితే, ఆ తర్వాత పరిణామాల్లో అమ్మకాల ఒత్తిడి అధికమవడం, ఇన్వెస్టర్లలో ఎస్‌వీబీ బ్యాంకు సంక్షోభ తీవ్ర స్థాయిపై ఆందోళనలు పెరగడంతో సెన్సెక్స్ ఓ దశలో ఏకంగా 1,200 పాయింట్లకు పైగా పతనమైంది.

ప్రధానంగా సిలికాన్ వ్యాలీ బ్యాంక్ సంక్షోభం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీయడంతో సెన్సెక్స్ ఐదు నెలల కనిష్టానికి దిగజారింది. అమెరికా బ్యాంకింగ్ వ్యవస్థపై పెట్టుబడిదారులు ఆందోళన చెందడంతో గ్లోబల్ మార్కెట్లలో పతనం ఎక్కువగా ఉంది. వీటికి తోడు రాబోయే సమావేశంలో ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు దూకుడుగా కొనసాగిస్తుందనే అంచనాల మధ్య మార్కెట్లకు ప్రతికూలత పెరగడంతో, అది మన మార్కెట్లపై కూడా పడింది.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 897.28 పాయింట్లు కుదేలై 58,237 వద్ద, నిఫ్టీ 258.60 పాయింట్లు నష్టపోయి 17,154 వద్ద ముగిశాయి. నిఫ్టీలో బ్యాంకింగ్, ఆటో 2 శాతానికి పైగా బలహీనపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో టెక్ మహీంద్రా కంపెనీ షేర్ మాత్రమే దాదాపు 7 శాతం పుంజుకుంది. కంపెనీ కొత్తగా సీఈఓ, ఎండీగా మోహిత్ జోషిని ఎన్నుకోవడంతో కంపెనీ షేర్ ధరకు రెక్కలొచ్చాయి.

ఇండస్ఇండ్ బ్యాంక్ అత్యధికంగా 7.46 శాతం క్షీణించింది. ఎస్‌బీఐ, టాటా మోటార్స్, ఎంఅండ్ఎం, బజాజ్ ఫిన్‌సర్వ్, యాక్సిస్ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, అల్ట్రా సిమెంట్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 82.20 వద్ద ఉంది.

Also Read...

రూ. 31.33 లక్షల కోట్లకు చలామణీలో ఉన్న నగదు!

Advertisement

Next Story

Most Viewed