వరుసగా రెండో రోజూ లాభపడ్డ సూచీలు!

by Harish |
వరుసగా రెండో రోజూ లాభపడ్డ సూచీలు!
X

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాలను సాధించాయి. అంతర్జాతీయ మార్కెట్లలో కొనసాగుతున్న సానుకూల సంకేతాలకు తోడు దేశీయంగా ఫైనాన్స్, ఆటో షేర్లలో కొనుగోళ్లు ఊపందుకోవడంతో బుధవారం సూచీలు రోజంతా లాభాల్లో కదలాడాయి. అమెరికా ఫెడ్ సమావేశానికి సంబంధించి ప్రకటన ఉన్న నేపథ్యంలో మదుపర్లు కొంత అప్రమత్తంగా వ్యవహరించినప్పటికీ గ్లోబల్ మార్కెట్లలో బ్యాంకింగ్ సంక్షోభం నెమ్మదిస్తుందనే ఆశలు పెరగడం, దేశీయ కీలక రంగాల మద్దతుతో పుంజుకున్నాయి.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 139.91 పాయింట్లు పెరిగి 58,214 వద్ద, నిఫ్టీ 44.40 పాయింట్లు లాభపడి 17,151 వద్ద ముగిశాయి. నిఫ్టీలో మెటల్, మీడియా, రియల్టీ రంగాలు మాత్రమే స్వల్పంగా బలహీనపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, సన్‌ఫార్మా, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా మోటార్స్, టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్, అల్ట్రా సిమెంట్ కంపెనీల షేర్లు లాభాలు సాధించాయి.

ఎన్‌టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, నెస్లే ఇండియా, హెచ్‌సీఎల్ టెక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 82.64 వద్ద ఉంది.

Advertisement

Next Story

Most Viewed