60 వేల దిగువకు పడిపోయిన సెన్సెక్స్!

by Vinod kumar |
60 వేల దిగువకు పడిపోయిన సెన్సెక్స్!
X

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకుల మధ్య భారీ నష్టాలు నమోదయ్యాయి. బెంచ్‌మార్క్ సెన్సెక్స్, నిఫ్టీలు గ్లోబల్ మార్కెట్లలో నెలకొన్న అమ్మకాల కారణంగా 1.5 శాతానికి పైగా పతనమయ్యాయి. సెన్సెక్స్ 60 వేల దిగువకు పడిపోయింది. ముఖ్యంగా ఫెడ్ మినిట్స్‌కు ముందు వడ్డీ రేట్ల పెంపు ఉంటుందనే అంచనాలతో పాటు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య మదుపర్ల సెంటిమెంట్ దెబ్బతిన్నది.

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలకు తోడు దేశీయంగా కీలక రంగాల్లో పెద్ద ఎత్తున అమ్మకాలు జరగడంతో సూచీలు కుప్పకూలాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 927.74 పాయింట్లు పతనమై 59,744 వద్ద, నిఫ్టీ 272.40 పాయింట్లు కుదేలై 17,554 వద్ద ముగిశాయి. నిఫ్టీ లో మెటల్ రంగం అత్యధికంగా 2.64 శాతం నీరసించగా, మిగిలిన రంగాలు 1 శాతానికి పైగా బలహీనపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఐటీసీ మాత్రమే లాభాన్ని దక్కించుకుంది.

మిగిలిన షేర్లన్నీ అమ్మకాలకు గురయ్యాయి. బజాజ్ ఫైనాన్స్, ఎంఅండ్ఎం, బజాజ్ ఫిన్‌సర్వ్, రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఆల్ట్రా సిమెంట్, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా స్టీల్, ఎల్అండ్‌టీ, ఐటీసీ కంపెనీల స్టాక్స్ అధిక నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 82.91 వద్ద ఉంది. భారీ నష్టాల కారణంగా మదుపర్ల సంపద గా భావించే బీఎస్ఈ మార్కెట్ క్యాప్ బుధవారం ఒక్కరోజే రూ. 4 లక్షల కోట్ల మేర ఆవిరైంది.

Advertisement

Next Story

Most Viewed