నష్టాల్లో ముగిసిన సూచీలు!

by Harish |
నష్టాల్లో ముగిసిన సూచీలు!
X

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు మరోసారి నష్టాలను ఎదుర్కొన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల పరిణామాలకు తోడు దేశీయంగా కీలక రంగాల్లో అమ్మకాల కారణంగా సూచీలు బలహీనపడ్డాయి. ముఖ్యంగా అమెరికా ఇటీవలి ఆర్థిక గణాంకాల నేపథ్యంలో ఫెడ్ మరోసారి వడ్డీ రేట్లను పెంచుతుందనే ఆందోళనలు మదుపర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఇదే సమయంలో దేశీయంగా ఎఫ్ఎంసీజీ రంగంలోని షేర్లు ఎక్కువ నష్టపోవడంతో స్టాక్ మార్కెట్లలో ఒత్తిడి కనిపించింది.

సోమవారం ఉదయం ప్రారంభం సమయంలో ట్రేడింగ్ సానుకూలంగానే కదలాడినప్పటికీ, మిడ్-సెషన్‌కు ముందు అమ్మకాలు పెరిగాయి. అదేవిధంగా గ్లోబల్ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు రావడం, ఎఫ్ఎంసీజీ సహా దాదాపు అన్ని రంగాలు నీరసించడం కలిసిరాలేదు.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 311.03 పాయింట్లు కోల్పోయి 60,691 వద్ద, నిఫ్టీ 99.60 పాయింట్లు తగ్గి 17,844 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఐటీ, ఆటో రంగాలు మాత్రమే బలపడ్డాయి. పీఎస్‌యూ బ్యాంక్ అధికంగా 1 శాతానికి మింది కుదేలైంది. సెన్సెక్స్ ఇండెక్స్‌లో అల్ట్రాటెక్ సిమెంట్, పవర్‌గ్రిడ్, టెక్ మహీంద్రా, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, ఎంఅండ్ఎం కంపెనీల షేర్లు లాభాలను దక్కించుకున్నాయి.

హెచ్‌డీఎఫ్‌సీ, మారుతీ సుజుకి, కోటక్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్‌బీఐ, టైటాన్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 82.73 వద్ద ఉంది.

Advertisement

Next Story

Most Viewed