Economic Survey: దేశంలో పెరుగుతున్న ఊబకాయంపై ఆందోళన వ్యక్తం చేసిన ఆర్థిక సర్వే

by S Gopi |
Economic Survey: దేశంలో పెరుగుతున్న ఊబకాయంపై ఆందోళన వ్యక్తం చేసిన ఆర్థిక సర్వే
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో యువత అలవర్చుకుంటున్న ఆహారపు అలవాట్లు భారత ఆర్థికవ్యవస్థకు అతిపెద్ద సమస్యగా మారనున్నాయని సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే పేర్కొంది. దీనికి ప్రధానంగా సోషల్ మీడియాతో పాటు డివైజ్‌ల స్క్రీన్ టైమ్, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు కారణాలుగా ఉంటున్నాయని సర్వే ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో పనిచేసే వయసు గల జానాభాకు ఉద్యోగావకాశాలు లభించాలంటే, వారికి నైపుణ్యం, మంచి ఆరోగ్యం అవసరం అని సర్వే అభిప్రాయపడింది. కానీ, సోషల్ మీడియా, బద్ధకపు అలవాట్లు, అనారోగ్యానికి దారితీసే ఆహారం వల్ల ప్రజారోగ్యం దెబ్బతింటుందని తద్వారా దేశ ఆర్థికవ్యవస్థపై ప్రభావం ఉంటుందని ఆర్థిక సర్వే పేర్కొంది. ఈ క్రమంలోనే దేశంలో పెరుగుతున్న ఊబకాయంపై ఆర్థిక సర్వే ఆందోళన వ్యక్తం చేసింది. అధిక చక్కెర, కొవ్వు ఉన్న ప్రాసెస్‌డ్ ఫుడ్ తీసుకునే అలవాటు పెరిగిందని, సగానికి పైగా అనారోగ్య సమస్యలకు ఈ రకమైన ఆహారపు అలవాట్లే కారణమవుతున్నాయని సర్వే వెల్లడించింది. దీనికి తగిన పరిష్కారం వెతకాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొంది. ఇలాంటి టాక్సిక్ అలవాట్లకు ప్రైవేట్ రంగమే ప్రధాన కారణంగా ఉంటోంది. వరల్డ్ ఒబెసిటీ ఫెడరేషన్ ప్రకారం, భారత్‌లోని పెద్దల్లో ఊబకాయం రేటు మూడు రెట్లు ఎక్కువగా ఉన్నాయని అంచనా. ఇది చిన్నారుల్లోనూ వేగంగా నమోదవుతోందని, ప్రపంచవ్యాప్తంగా వియత్నాం, నమీబియా తర్వాత భారత్ నిలిచిందని ఆర్థిక సర్వే స్పష్టం చేసింది.

Advertisement

Next Story