- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Income Tax: ఆదాయపు పన్ను విషయంలో సోషల్ మీడియా ఖాతాల తనిఖీపై ఐటీ శాఖ స్పష్టత

దిశ, బిజినెస్ బ్యూరో: కొత్త ఆదాయపు పన్ను బిల్లులో పన్ను చెల్లింపుదారుల సోషల్ మీడియా ఖాతాలు, ఈ-మెయిల్, ఆన్‌లైన్ పెట్టుబడులు, ట్రేడింగ్ అకౌంట్ వివరాల తనిఖీ చేసే అధికారాలు కల్పిస్తూ రూపొందించారు. అయితే, దీనిపై రకరకాల ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో ఆదాయపు పన్ను విభాగం అధికారులు స్పష్టత ఇచ్చారు. కొత్త ఐటీ బిల్లు పన్ను చెల్లింపుదారులకు వ్యతిరేకం కాదని, ఎవరైనా పన్ను ఎగవేతలకు పాల్పడినట్టు సరైన సమాచారం ఉన్నప్పుడు, ఐటీ అధికారులు సోదాలు, తనిఖీలు నిర్వహించిన సమయంలో అవసరం అనుకున్నప్పుడు మాత్రమే అటువంటి యాక్సెస్‌ను కోరే అవకాశం ఉందని ఓ అధికారి వివరించారు.
పాత ఆదాయపు చట్టం-1961లోనూ పన్ను ఎగవేతదారులపై సోదాలు నిర్వహించినప్పుడు వారి డిజిటల్ వివరాలను తనిఖీ చేసే అధికారం ఉంది. దీన్నే కొత్త చట్టంలోనూ కొనసాగించాం. కొత్త బిల్లు అమల్లోకి వచ్చాక వ్యక్తుల సోషల్ మీడియా అకౌంట్లు, మెయిల్స్, ఆన్‌లైన్ పెట్టుబడులపై నిఘా ఉంటుందనే కథనాలు అవాస్తవం. ఆదాయపు పన్ను శాఖ ఎలాంటి నిఘా పెట్టదు. పన్ను చెల్లింపుదారుల గోప్యతకు ఎలాంటి నష్టం ఉండదు. సోదా సమయంలో సోషల్ మీడియా అకౌంట్లు, ఇతర డిజిటల్ పాస్‌వర్డ్‌లను చెప్పని సందర్భంలో మాత్రమే అధికారులు యాక్సెస్ చేసే అవకాశం ఉంటుందని ఆదాయపు పన్ను శాఖ ఉన్నతాధికారి వివరించారు.
ప్రస్తుతం ఉన్న చట్టంలోని సెక్షన్ 132 ప్రకారం, ఎలక్ట్రానిక్ రికార్డుల రూపంలో ఉన్న అకౌంట్లు, బుక్స్, ఇతర డాక్యుమెంట్లను ఐటీ అధికారులు కోరే అధికారం ఉంటుంది. వాటిని స్వాధీనం కూడా చేసుకోవచ్చు. గత కొన్నేళ్లలో ఇంటర్నెట్ ఆధారిత వినియోగం, టెక్నాలజీ పెరిగిన కారణంగా పన్ను ఎగవేసే పద్దతులు మారిపోయాయి. ఈ క్రమంలో సోదాలు, తనిఖీల సమయంలో డిజిటల్ వివరాల యాక్సెస్ కీలకం. అటువంటి సందర్భాల్లో మాత్రమే వాటిని కోరే అవకాశం ఉంటుంది. అంతేకానీ ప్రచారంలో ఉన్నట్టు వ్యక్తుల డిజిటల్ అకౌంట్లపై నిఘా ఉండదని పేర్కొన్నారు.