1,500 పాయింట్లకు పైగా ఎగసిన సెన్సెక్స్!

by sudharani |
1,500 పాయింట్లకు పైగా ఎగసిన సెన్సెక్స్!
X

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు ఊహించని స్థాయిలో రికవరీ సాధించాయి. ఈ వారం భారీ నష్టాలతో మొదలైన సూచీలు మంగళవారం ఒక్కసారిగా పోయిన నష్టాలను తిరిగి సాధించాయి. ఉదయం ప్రారంభం నుంచే లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు చివరి వరకు దూకుడైన ట్రేడింగ్ కొనసాగించాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల్లో పెద్ద ఎత్తున కొనుగోళ్లు జరగడం, కీలక కంపెనీల షేర్లు 3 శాతం చొప్పున పుంజుకోవడం మార్కెట్లకు కలిసొచ్చింది. మిడ్-సెషన్ సమయం నుంచి ఏ దశలోనూ వెనక్కి తగ్గని సూచీలు చివరికి ఏకంగా 1,500 పాయింట్ల కంటే ఎక్కువ లాభపడ్డం గమనార్హం. ఒక్కరోజులో సెన్సెక్స్ 2.70 శాతం, నిఫ్టీ 2.58 శాతం పెరిగాయి.

దేశీయ పరిణామాలకు తోడు అంతర్జాతీయ మార్కెట్లలో ఇటీవల ఫెడ్ చీఫ్ జెరోమ్ పావెల్ వడ్డీ రేట్ల పెంపు ఉంటుందని ప్రకటించిన తర్వాత దెబ్బతిన్న అమెరికా మార్కెట్లలో కనిష్టాల వద్ద కొనుగోళ్లు భారీగా జరిగాయి. దీంతో గ్లోబల్ మార్కెట్ల ఫ్యూచర్స్ సానుకూలంగా మారాయి. అలాగే, ఇటీవల పరిణామాల మధ్య ముడి చమురు ధరలు గరిష్ఠాల నుంచి దిగిరావడం, అమెరికా డాలర్ 20 ఏళ్ల గరిష్ఠానికి చేరిన తర్వాత నెమ్మదించడం వంటి అంశాలు భారత మార్కెట్లలో ఉత్సాహాన్ని పెంచాయి. వీటితో పాటు భారత రూపాయి కరెన్సీ బలంగా పుంజుకోవడంతో విదేశీ పెట్టుబడిదారులు షేర్లను భారీగా కొన్నారు. రూపాయి విలువ ఈ ఏడాదిలోనే అత్యధిక సింగిల్ డే లాభం చూడటం విశేషం.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,564.45 పాయింట్లు ఎగసి 59,537 వద్ద, నిఫ్టీ 446.40 పాయింట్లు పుంజుకుని 17,759 వద్ద ముగిశాయి. నిఫ్టీలో దాదాపు అన్ని రంగాలు 2-4 శాతం మధ్య బలపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లోనూ అన్ని కంపెనీల షేర్లు లాభపడగా, అత్యధికంగా బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఇండస్ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్, టాటా స్టీల్, హెచ్‌డీఎఫ్‌సీ, హిందూస్తాన్ యూనిలీవర్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎస్‌బీఐ యాక్సిస్ బ్యాంక్ షేర్లు ఏకంగా 3 శాతానికి పైగా పెరగడం స్టాక్ మార్కెట్ల భారీ లాభాలకు ప్రధాన మద్దతుగా నిలిచాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 79.53 వద్ద ఉంది.

ఒక్కరోజులో రూ. 5.56 లక్షల కోట్లు పెరిగిన మదుపర్ల సంపద..

ఇటీవల వరుస నష్టాలతో నష్టపోయిన మదుపర్లు మంగళవారం లాభాలతో భారీగా సంపదను సాధించారు. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈ మార్కెట్ క్యాప్ మంగళవారం ఒక్కరోజే రూ. 5.56 లక్షల కోట్లు పెరిగి రూ. 280.21 లక్షల కోట్లక్ చేరుకుంది.

Advertisement

Next Story