వారాంతం నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!

by Harish |   ( Updated:2023-03-24 13:44:46.0  )
వారాంతం నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
X

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లకు వారాంతం నష్టాలు ఎదురయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా బ్యాంకింగ్ రంగంలో నెలకొన్న సంక్షోభం కారణంగా వారం ప్రారంభంలో నీరసించిన సూచీలు ఆ తర్వాత అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లను పెంచడం, మాంద్యం భయాలు పెరగడం, టెక్ దిగ్గజాలు రెండో దశ లేఆఫ్స్ ప్రకటిస్తుండటం వంటి పరిణామాలు మార్కెట్లలో ఒత్తిడి పెంచాయి.

శుక్రవారం ట్రేడింగ్‌లో ఉదయం కాసేపు లాభాలను చూసినప్పటికీ మిడ్-సెషన్‌ను ముందు బలహీనపడ్డాయి. కొద్దిసేపు లాభనష్టాల మధ్య కదలాడినప్పటికీ చివర్లో అమ్మకాలు పోటెత్తడంతో నష్టాలు పెరిగాయి. ముఖ్యంగా రిలయన్స్, బజాజ్ కంపెనీల షేర్లతో పాటు కీలక కంపెనీల షేర్లలో విక్రయాలు పెరగడం కూడా మదుపర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 398.18 పాయింట్లు కోల్పోయి 57,527 వద్ద, నిఫ్టీ 131.85 పాయింట్లు నష్టపోయి 16,945 వద్ద ముగిశాయి. నిఫ్టీలో మెటల్, బ్యాంకింగ్, మీడియా, రియల్టీ రంగాలు 2 శాతానికి పైగా కుదేలయ్యాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో కోటక్ బ్యాంక్, ఇన్ఫోసిస్, పవర్‌గ్రిడ్, టెక్ మహీంద్రా, ఏషియన్ పెయింట్, విప్రో కంపెనీల షేర్లు లాభాలు దక్కించుకున్నాయి.

బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, టాటా స్టీల్, రిలయన్స్, ఎల్అండ్‌టీ, ఎస్‌బీఐ, హెచ్‌సీఎల్ టెక్, ఎంఅండ్ఎం స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 82.46 వద్ద ఉంది.

Also Read..

ఈవీల కోసమే ప్రత్యేక షోరూమ్‌లు ఏర్పాటు చేయనున్న టాటా మోటార్స్!

Advertisement

Next Story

Most Viewed