Stock Market: భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. రూ. 6 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద

by S Gopi |
Stock Market: భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. రూ. 6 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద
X

దిశ, బిజినెస్ బ్యూరో: 2025 ఏడాది రెండోరోజే దేశీయ ఈక్విటీ మార్కెట్లు భారీ లాభాలతో దూసుకెళ్లాయి. తొలిరోజు ఓ మోస్తరు లాభాలను చూసిన సూచీలు గురువారం ట్రేడింగ్‌లో అంతకుమించి రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్ ఏకంగా 1,400 పాయింట్లకు ర్యాలీ చేయగా, నిఫ్టీ 400 పాయింట్లు దాటింది. కీలక ఐటీ, ఆటో రంగాల షేర్లలో పెద్ద ఎత్తున అమ్మకాలు ర్యాలీకి ప్రధాన కారణాలయ్యాయి. 2024, డిసెంబర్ నెలకు సంబంధించి వాహన పరిశ్రమలో అంచనాలను తలకిందులు చేస్తూ మెరుగైన అమ్మకాలు ఊపందుకోవడం, మూడో త్రైమాసికానికి సంబంధించి ఐటీ రంగ కంపెనీల ఆదాయాలు అత్యంత సానుకూలంగా ఉండటం స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను పెంచాయి. వీటికి తోడు డిసెంబర్ నెలలో జీఎస్టీ వసూళ్లు గతేడాది కంటే 7 శాతం పెరగడం కూడా అధిక లాభాలకు మద్దతిచ్చాయి. ఈ క్రమంలోనే మదుపర్ల సంపద రూ. 6 లక్షల కోట్లకు పైగా పెరిగి రూ. 450 లక్షల కోట్లకు చేరింది. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,436.30 పాయింట్లు ఎగసి 79,943 వద్ద, నిఫ్టీ 445.75 పాయింట్లు లాభపడి 24,188 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఆటో రంగ షేర్లు 3.80 శాతం పుంజుకోగా, ఐటీ 2 శాతానికి పైగా పెరిగింది. మిగిలిన రంగాలు మెరుగైన ర్యాలీని చూశాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో సన్‌ఫార్మా మాత్రమే నష్టపోయింది. మిగిలిన షేర్లు లాభాల్లో ముగిశాయి. అత్యధికంగా బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఫైనాన్స్ 6 శాతానికి పైగా పెరిగాయి. అమెరికా కరెన్సీ డాలర్ డిమాండ్ పెరగడంతో పాటు మన మార్కెట్ల నుంచి విదేశీ నిధులు వెనక్కి వెళ్లడంతో అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ 9 పైసలు క్షీణించి రూ. 85.76 వద్ద ఉంది.

Advertisement

Next Story

Most Viewed