Stock Market: స్టాక్ మార్కెట్లలో కొనసాగుతున్న రికార్డు లాభాలు

by S Gopi |
Stock Market: స్టాక్ మార్కెట్లలో కొనసాగుతున్న రికార్డు లాభాలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో రికార్డు లాభాలు కొనసాగుతున్నాయి. గతవారం జీవితకాల గరిష్ఠాలకు చేరిన సూచీలు సోమవారం ట్రేడింగ్‌లో సైతం కొత్త ఆల్‌టైమ్ హై స్థాయిలను తాకాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మద్దతు లేనప్పటికీ, దేశీయంగా కీలక ఐటీ, ఫైనాన్స్ రంగాల్లో కొనుగోళ్లు ఉత్సాహాన్నిచ్చాయి. ఈ క్రమంలోనే సెన్సెక్స్ 82,725 వద్ద కొత్త రికార్డు స్థాయిలను తాకింది. ప్రధానంగా గ్లోబల్ మార్కెట్లు బలహీనంగా ఉన్నప్పటికీ అమెరికాలో ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపుపై ఆశలు, మన మార్కెట్లలోకి విదేశీ నిధులు రావడం వంటి పరిస్థితులు రికార్డు ర్యాలీకి దోహదపడ్డాయి. భారత ఆర్థిక వృద్ధి సానుకూలంగా ఉండటం, తాజా పీఎంఐ గణాంకాలు సగటు కంటే ఎక్కువ కావడం, ఇది రానున్న రోజుల్లో ఆదాయ పెరుగుదలను సూచన కావడంతో ర్యాలీ కనిపించింది. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 194.07 పాయింట్లు లాభపడి 82,559 వద్ద, నిఫ్టీ 42.80 పాయింట్ల లాభంతో 25,278 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఫైనాన్స్, ఎఫ్ఎంసీజీ, ఐటీ రంగాలు రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌సీఎల్ టెక్, ఐటీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఆల్ట్రా సిమెంట్, ఇన్ఫోసిస్ షేర్లు 1 శాతానికి పైగా పెరిగాయి. ఎన్‌టీపీసీ, టాటా మోటార్స్, ఎంఅండ్ఎం, భారతీ ఎయిర్‌టెల్, టీసీఎస్, పవర్‌గ్రిడ్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.90 వద్ద ఉంది.

Advertisement

Next Story

Most Viewed