ఒడిదుడుకుల మధ్యే లాభాలు సాధించిన స్టాక్ మార్కెట్లు

by S Gopi |
ఒడిదుడుకుల మధ్యే లాభాలు సాధించిన స్టాక్ మార్కెట్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వారాంతం లాభాలను సాధించాయి. శుక్రవారం ఉదయం సానుకూలంగా ట్రేడింగ్ ప్రారంభమైనప్పటికీ రోజంతా ఊగిసలాట మధ్య ర్యాలీ కొనసాగింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాల కారణంగా లాభాలు కనిపించినప్పటికీ, యూఎస్, యూకేతో పాటు భారత ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. దీనికితోడు మిడ్,స్మాల్ క్యాప్ సూచీల్లో అమ్మకాల ఒత్తిడి లాభాలను పరిమితం చేశాయి. మిడ్-సెషన్ తర్వాత కీలక రిలయన్స్, బ్యాంకింగ్ రంగ షేర్లలో కొనుగోళ్ల మద్దతు కారణంగా సూచీలు లాభాల్లో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 167.06 పాయింట్లు లాభపడి 71,595 వద్ద, నిఫ్టీ 64.55 పాయింట్ల లాభంతో 21,782 వద్ద ముగిశాయి. నిఫ్టీలో బ్యాంకింగ్, ఫైనాన్స్, హెల్త్‌కేర్ రంగాలు రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఎస్‌బీఐ, సన్‌ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, టైటాన్, బజాజ్ ఫైనాన్స్, నెస్లె ఇండియా కంపెనీల షేర్లు లాభాలను సాధించాయి. ఎంఅండ్ఎం, భారతీ ఎయిర్‌టెల్, ఎన్‌టీపీసీ, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, పవర్‌గ్రిడ్, టాటా మోటార్స్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.04 వద్ద ఉంది.

Advertisement

Next Story