వరుస నాలుగు రోజుల ర్యాలీకి బ్రేక్

by S Gopi |
వరుస నాలుగు రోజుల ర్యాలీకి బ్రేక్
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత ఈక్విటీ మార్కెట్లలో వరుస నాలుగు సెషన్ల ర్యాలీకి బ్రేక్ పడింది. అంతకుముందు సెషన్‌లో గరిష్ఠాల ఒడిదుడుకులను ఎదుర్కొన్న సూచీలు మంగళవారం ట్రేడింగ్‌లోనూ అదే ధోరణిని ఎదుర్కొన్నాయి. కొత్త గరిష్ఠాల వద్ద అమ్మకాల ఒత్తిడి, లాభాల స్వీకరణ కారణంగా మార్కెట్లు బలహీనంగా ర్యాలీ చేశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలకు తోడు విదేశీ మదుపర్లు భారత ఈక్విటీల నుంచి నిధులు ఉపసంహరించుకోవడం వంటి పరిణామాలు ప్రభావితం చేశాయి. ముఖ్యంగా అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉండటం, మరో వారం రోజుల్లో అమెరికా జాబ్ డేటా వెలువడనుండటంతో గ్లోబల్ మార్కెట్లు బలహీనంగా ఉన్నాయి. దీనివల్ల ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవరించారు. దీనికితోడు దేశీయంగా పెట్టుబడిదారులు వరుస ర్యాలీ తర్వాత అమ్మకాలకు మొగ్గు చూపారు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 195.16 పాయింట్లు నష్టపోయి 73,677 వద్ద, నిఫ్టీ 49.30 పాయింట్ల నష్టంతో 22,356 వద్ద ముగిశాయి. నిఫ్టీలో పీఎస్‌యూ బ్యాంక్, ఆటో రంగాలు రాణించినప్పటికీ, మీడియా, ఐటీ, ఎఫ్ఎంసీజీ, ఫైనానస్ రంగాలు నీరసించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో టాటా మోటార్స్, భారతీ ఎయిర్‌టెల్, ఎస్‌బీఐ, సన్‌ఫార్మా, ఎన్‌టీపీసీ, ఎంఅండ్ఎం కంపెనీల షేర్లు లాభాలను దక్కించుకున్నాయి. బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, నెస్లె ఇండియా, టీసీఎస్, ఆల్ట్రా సిమెంట్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 82.92 వద్ద ఉంది.

Advertisement

Next Story