ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు

by S Gopi |
ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్‌లో ఫ్లాట్‌గా ముగిశాయి. వరుస లాభాల తర్వాత గరిష్ఠాల వద్ద లాభాల స్వీకరణతో సూచీలు రెండోరోజు బలహీనపడ్డాయి. మంగళవారం అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ మిడ్-సెషన్ తర్వాత అమ్మకాల ఒత్తిడి మదుపర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ముఖ్యంగా ఫైనాన్స్ రంగం షేర్లలో అధికంగా అమ్మకాలు జరిగాయి. రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లను ఇన్వెస్టర్లు ఎక్కువగా విక్రయించారు. వీటికి తోడు బుధవారం వెలువడనున్న ఫెడ్ పాలసీ నిర్ణయం, భారత సీపీఐ ద్రవ్యోల్బణ డేటా కారణంగా పెట్టుబడిదారులు అప్రమత్తంగా వ్యవహరించారు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 33.49 పాయింట్లు నష్టపోయి 76,456 వద్ద, నిఫ్టీ 5.65 పాయింట్ల లాభంతో 23,264 వద్ద ముగిశాయి. నిఫ్టీలో మీడియా, రియల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాలు రాణించగా, మిగిలిన రంగాలు నీరసించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఎల్అండ్‌టీ, టాటా మోటార్స్, మారుతీ సుజుకి, ఎంఅండ్ఎం, ఆల్ట్రా సిమెంట్, టెక్ మహీంద్రా కంపెనీల షేర్లు లాభాలను దక్కించుకున్నాయి. కోటక్ బ్యాంక్, ఏషియన్ పెయింట్, ఐటీసీ, రిలయన్స్, సన్‌ఫార్మా, యాక్సిస్ బ్యాంక్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.58 వద్ద ఉంది.

Advertisement

Next Story

Most Viewed