టోకనైజేషన్ అమలుకు సిద్ధమంటున్న ఎస్‌బీఐ!

by Harish |
టోకనైజేషన్ అమలుకు సిద్ధమంటున్న ఎస్‌బీఐ!
X

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) కొత్త డెబిట్, క్రెడిట్ కార్డుల నిబంధనలను అక్టోబర్ నుంచి అమలు చేయనున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ నిర్ణయం ద్వారా క్రమంగా పెరుగుతున్న సైబర్ మోసాలు, వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని దొంగలించే ఘటనలను నియంత్రించవచ్చని ఎస్‌బీఐ తెలిపింది. ఇందులో భాగంగా డేటా చోరీని కట్టడి చేస్తూ ఆర్‌బీఐ తెచ్చిన టోకనైజేషన్‌ను అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని క్రెడిట్ కార్డుల జారీ సంస్థ ఎస్‌బీఐ కార్డు ప్రకటించింది.

నిబంధనలకు అనుగుణంగా ఆర్థిక సేవలందించే మాస్టర్ కార్డు, వీసా, రూపేలతో భాగస్వామ్యం కోసం సిద్ధంగా ఉన్నట్టు ఎస్‌బీఐ కార్డు సీఈఓ, ఎండీ రామ్మోహాన్ రావు తెలిపారు. టోకనైజేసన్ ద్వారా ఆన్‌లైన్ చెల్లింపుల్లో క్రెడిట్, డెబిట్ కార్డుల వివరాలకు బదులుగా ప్రత్యేక టోకెన్ అనే కోడ్ జనరేట్ అవుతుంది. దీనివల్ల ఆన్‌లైన్ లావాదేవీలు అత్యంత సురక్షితంగా జరుగుతాయి. వినియోగదారుల వ్యక్తిగత సమాచారం చోరీకి అవకాశం ఉండదు. అందుకే టోకనైజేషన్ విధానంలో వినియోగదారుల ప్రయోజనాలను కాపాడటానికి వీలవుతుందని రామ్మోహన్ రావు వెల్లడించారు.

ఆర్‌బీఐ ఈ కార్డు టోకనైజేషన్ అమలుకు సెప్టెంబర్ 30ని తుది గడువుగా నిర్దేశించిన సంగతి తెలిసిందే. ఇదివరకు జూన్ 30 ఉండగా, వ్యాపారుల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు పొడిగించారు.

Advertisement

Next Story