త్వరలో రష్యాతో రూపాయి మారకంలో వాణిజ్య నిర్వహణ!

by srinivas |
త్వరలో రష్యాతో రూపాయి మారకంలో వాణిజ్య నిర్వహణ!
X

న్యూఢిల్లీ: భారత్ త్వరలో రష్యాతో రూపాయి మారకంలో వాణిజ్యాన్ని ప్రారంభిస్తుందని భారత ఎగుమతి సంస్థల సమాఖ్య(ఎఫ్ఐఈఓ) అధ్యక్షుడు ఎ శక్తివేల్ తెలిపారు. ఇరు దేశాల మధ్య రూపాయిలో వాణిజ్య నిర్వహణకు ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ)ని అధీకృత బ్యాంకుగా ప్రభుత్వం నిర్ణయించిన తర్వాత ఆయన ఈ ప్రకటన చేశారు. మరో రెండు వారాల్లోగా రష్యా కూడా తమ దేశం తరఫున అధీకృత బ్యాంకును ఎంపిక చేసి, ప్రకటించే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.

రష్యాతో వాణిజ్యాన్ని సులభతరం చేసేందుకు ఎస్‌బీఐ ముందుకు రాగా, కొన్ని ఇతర బ్యాంకులు కూడా ఆసక్తి చూపించాయి. భారత్ ఇప్పటికే ఇరాన్‌తో రూపాయి మారకంలో చెల్లింపుల యంత్రాంగాన్ని కలిగి ఉంది. ఇదే తరహాలో రష్యాతోనూ జరుగుతుందని శక్తివేల్ వివరించారు. ఈ ఏడాది ప్రారంభంలో ఉక్రెయిన్-రష్యా యుద్ధం వల్ల యూరప్ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. ఈ పరిణామాలతో రష్యాకు భారత్ ఎగుమతులు మూడో వంతు క్షీణించాయి. ఎగుమతులు, దిగుమతుల లావాదేవీలను భారత కరెన్సీ రూపాయి మారకంలో నిర్వహించడానికి అవసరమైన ఏర్పాటు చూడాలని బ్యాంకులను ఆర్‌బీఐ సర్క్యులర్ జారీ చేసిన సంగతి తెలిసిందే. డాలర్‌పై రూపాయి ఆధారపడటాన్ని తగ్గించేందుకు ఆర్‌బీఐ, ప్రభుత్వం ఈ చర్యలను తీసుకుంది.

Advertisement

Next Story

Most Viewed