మళ్లీ భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

by S Gopi |
మళ్లీ భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లు మరోసారి భారీ నష్టాలను ఎదుర్కొన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలకు తోడు ఆసియా మార్కెట్ల మిశ్రమ ర్యాలీ, దేశీయ కీలక ఐటీ రంగం షేర్లలో అమ్మకాలు సూచీలపై ఒత్తిడిని పెంచాయి. ప్రధానంగా యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకోనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రెండూ 1 శాతానికి పైగా క్షీణించాయి. ప్రీమియం వాల్యూయేషన్‌పై ఆందోళనలు, అమెరికా ఫెడ్ నిర్ణయం, డాలర్ పెరుగుదల వంటి అంశాలు మన మార్కెట్లను బలహీనపరిచాయని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 736.37 పాయింట్లు కోల్పోయి 72,012 వద్ద, నిఫ్టీ 238.25 పాయింట్లు నష్టపోయి 21,817 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఐటీ, మీడియా, ఫార్మా, ఎఫ్ఎంసీజీ రంగాలు 2 శాతానికి క్షీణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో బజాజ్ ఫైనాన్స్, కోటక్ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు లాభాలను సాధించాయి. టీసీఎస్, నెస్లె ఇండియా, ఇండస్ఇండ్ బ్యాంక్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, పవర్‌గ్రిడ్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.02 వద్ద ఉంది. అధిక నష్టాల కారణంగా మదుపర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈ మార్కెట్ క్యాప్ మంగళవారం ఒక్కరోజే రూ. 4.83 లక్షల కోట్లు తగ్గి రూ. 373.96 లక్షల కోట్లకు చేరుకుంది.

Advertisement

Next Story

Most Viewed