వారాంతం ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు

by S Gopi |
వారాంతం ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుస రికార్డు లాభాల తర్వాత శుక్రవారం తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. శుక్రవారం ట్రేడింగ్‌లో అంతర్జాతీయ మార్కెట్ల నుచి మద్దతు లేకపోవడం, రోజంతా అమ్మకాల ఒత్తిడి కారణంగా సూచీలు బలహీనపడ్డాయి. ప్రధానంగా వారాంతం కారణంగా మదుపర్లు గరిష్ఠాల లాభాల స్వీకరణకు దిగడం, కీలక ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ రంగం షేర్లను విక్రయించేందుకు మొగ్గుచూపడంతో ఫ్లాట్‌గా ముగిశాయి. అయితే, ఆఖరి గంటలో రిలయన్స్ జియో ఐపీఓ వార్తలతో రిలయన్స్ కంపెనీ షేర్లలో కొనుగోళ్లు కనిపించాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 53.07 పాయింట్లు నష్టపోయి 79,996 వద్ద, నిఫ్టీ 21.70 పాయింట్లు లాభపడి 24,323 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్, హెల్త్‌కేర్, ఎఫ్ఎంసీజీ రంగాలు 1 శాతానికి పైగా పుంజుకున్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఎస్‌బీఐ, రిలయన్స్, హిందూస్తాన్ యూనిలీవర్, ఎన్‌టీపీసీ, ఎల్అండ్‌టీ, పవర్‌గ్రిడ్, నెస్లె ఇండియా, ఐటీసీ షేర్లు లాభాలను దక్కించుకున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అత్యధికంగా 4.55 శాతం క్షీణించగా, టైటాన్, టాటా స్టీల్, ఎంఅండ్ఎం, ఇండస్ఇండ్ బ్యాంక్, ఆల్ట్రా సిమెంట్ కంపెనీల స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.50 వద్ద ఉంది.

Advertisement

Next Story