స్థానిక బొమ్మల తయారీకి రిలయన్స్ రిటైల్ జాయింట్ వెంచర్ ఏర్పాటు!

by Vinod kumar |
స్థానిక బొమ్మల తయారీకి రిలయన్స్ రిటైల్ జాయింట్ వెంచర్ ఏర్పాటు!
X

న్యూఢిల్లీ: దేశీయంగానే బొమ్మల తయారీ కోసం హర్యానాకు చెందిన సంస్థతో జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేయనున్నట్టు రిలయన్స్ రిటైల్ ఆదివారం ప్రకటనలో తెలిపింది. ఇటీవల భారత్‌లో తయారైన బొమ్మలకు గణనీయమైన డిమాండ్ ఏర్పడిందని, అందుకనుగుణంగా స్థానిక తయారీపై దృష్టి సారించనున్నట్టు రిలయన్స్ రిటైల్ సీఎఫ్ఓ దినేష్ తాలూజా చెప్పారు. కంపెనీ ఇప్పటికే బ్రిటీష్ టాయ్ బ్రాండ్ హామ్లేస్, దేశీయ బ్రాండ్ రోవాన్‌లతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ప్రస్తుతం బొమ్మల తయారీ వ్యాపార సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు హర్యానాకు చెందిన సర్కిల్-ఈ రిటైల్‌తో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేయనుంది.

ప్రస్తుతం రిలయన్స్ రిటైల్ డిజైన్ నుంచి విక్రయం వరకు అవసరమైన అన్ని ప్రక్రియను పటిష్టం చేసే వ్యూహంపై పనిచేస్తోంది. ఉత్పత్తి నుంచి తయారీ, రిటైల్ వరకు దశల వారీగా థర్డ్-పార్టీ తయారీదారులపై ఆధారపడటాన్ని తగ్గించే దిశగా జాయింట్ వెంచర్ సహాయపడుతుందని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. పరిశ్రమల సంఘం ఫిక్కీ, ఆర్థిక సేవల సంస్థ కేపీఎంజీ సంయుక్త నివేదిక ప్రకారం, భారత బొమ్మల మార్కెట్ 2019-20లో రూ. 8,204 కోట్ల నుంచి 2024-25 నాటికి రూ. 16,400 కోట్లతో రెట్టింపు అవుతుందని అంచనా.

Advertisement

Next Story

Most Viewed