ఎర్ర సముద్రంలో సంక్షోభం.. ఎగుమతిదారులకు బీమా కష్టాలు

by S Gopi |
ఎర్ర సముద్రంలో సంక్షోభం.. ఎగుమతిదారులకు బీమా కష్టాలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రపంచ నౌకా రవాణా రంగంలో అత్యంత కీలక మార్గమైన ఎర్ర సముద్రంలో హౌతీ రెబల్స్‌ సరకు రవాణా నౌకలపై దాడులకు దిగుతుండటంతో ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఇజ్రాయెల్‌, హమాస్‌ యుద్ధం నేపథ్యంలో ఇప్పుడు ఈ మార్గం ప్రమాదంలో పడింది. మధ్యదరా సముద్రం మీదుగా రవాణాకు ఇది అత్యంత దగ్గర కావడంతో పాటు ఆఫ్రికా చుట్టూ తిరిగి రాకుండా దక్షిణ, తూర్పు ఆసియాలకు ఇది ఎంతో అనుకూలమైన మార్గమైనందున కొత్త సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఎర్ర సముద్రంలో కొనసాగుతున్న సంక్షోభం కారణంగా భారతీయ ఎగుమతిదారులు రవాణా సరుకులపై బీమా పొందడానికి కేంద్ర ప్రభుత్వ సాయాన్ని కోరుతున్నారు. అయితే, అనేక ప్రైవేట్ బీమా కంపెనీలు ఈ మార్గంలో రవాణా అయ్యే సరుకుపై బీమా అందించడాన్ని నిలిపేశాయి. 'ఎగుమతిదారులకు బీమా పెద్ద సమస్యగా మారింది. సరుకు రవాణా రేట్లు రెండున్నర రెట్లు పెరిగినప్పటికీ, బీమా రక్షణ పొందడం కష్టంగా మారుతోంది ' అని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. బీమా కవరేజీ కోసం అనేక కంపెనీలు ప్రీమియంను పెంచాయి. అయితే, చాలా ప్రైవేట్ బీమా సంస్థలు సరైన హామీ లేకపోవడంతో బీమా అందించడం మానేశాయి.

యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు గత రెండు నెలల్లో ఎర్ర సముద్రం గుండా ప్రయాణించే సరుకు రవాణా నౌకలపై దాడి చేస్తున్నారు. ఈ మార్గాన్ని సాధారణంగా యూరప్, యూఎస్ తూర్పు తీరానికి వెళ్లే భారతీయ నౌకలు ఉపయోగిస్తాయి. హౌతీ దాడులను నివారించేందుకు కేప్ ఆఫ్ గుడ్ హోప్ చుట్టూ తిరగవలసి వస్తోంది. దీనివల్ల ప్రయాణ సమయంతో పాటు దూరం కూడా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఎగుమతిదారులు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖతో పలుమార్లు సమావేశాలు నిర్వహించి సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తున్నాయి. అధిక షిప్పింగ్ ఖర్చులను ఎదుర్కొంటున్న ఎగుమతిదారులకు తగిన క్రెడిట్ సదుపాయాన్ని అందించాలని ఆర్థిక సేవల విభాగాన్ని కోరినట్టు వాణిజ్య కార్యదర్శి సునీల్ బర్త్వాల్ అన్నారు. ఎర్ర సముద్రంలో సంక్షోభం కొనసాగితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఎగుమతులకు సుమారు రూ. రెండున్నర లక్షల కోట్ల నష్టం వాటిల్లవచ్చని అంచనా.

Advertisement

Next Story

Most Viewed