- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
RBI: ఐదేళ్ల తర్వాత రెపో రేటు తగ్గింపు.. ఈఎంఐ భారం తగ్గే అవకాశం

దిశ, బిజినెస్ బ్యూరో: అందరూ ఊహించినట్టుగానే భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) కీలక రేట్లలో సవరణలు చేసింది. గడిచిన ఐదేళ్ల నుంచి కీలక రెపో రేటును స్థిరంగా కొనసాగించిన ఆర్‌బీఐ ఎట్టకేలకు 0.25 శాతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 5-7 తేదీల మధ్య జరిగిన ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా శుక్రవారం వెల్లడించారు. 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ ఎంపీసీ నిర్ణయం తీసుకుందని, దీంతో రెపో రేటు 6.50 శాతం నుంచి 6.25 శాతానికి తగ్గుతుందని చెప్పారు. చివరిగా 2020, మే నెలలో కొవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో ఆర్‌బీఐ రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు తగ్గించింది. 2023, మే నెల తర్వాత నుంచి కీలక రేట్లను యథాతథంగా కొనసాగిస్తూ వచ్చింది.
0.25 శాతమే అయినా, సామాన్యుడికి భారీ ఊరట..
ఆర్‌బీఐ గవర్నర్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత సంజయ్ మల్హోత్ర తొలిసారి ఎంపీసీ సమావేశానికి నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. 'ఎంపీసీ విధానం చాలా మందికి ఆసక్తి కలిగించే అంశం. ఇది దేశంలోని అందరి జీవితాలను ప్రభావితం చేస్తుందని అన్నారు. ఆర్‌బీఐ తీసుకున్న తాజా నిర్ణయంతో రిటైల్ విభాగంలో గృహ, వాహన రుణాలపై వడ్డీ రేట్లు కూడా తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా బ్యాంకు రుణాలు తీసుకున్న వారికి ఇది ఊరట కలిగించే అంశం. ఐదేళ్ల నుంచి పెరిగిన వడ్డీ చెల్లించిన వారికి ఈసారి వడ్డీ రేట్లు ఈఎంఐ భారం తగ్గనుంది. తాజా సమావేశంలో ఆర్‌బీఐ 25 బేసిస్ పాయింట్లనే తగ్గించినప్పటికె ఇళ్ల రుణాలు తీసుకున్న వారు చెల్లించే ఈఎంఐలో స్పష్టమైన వ్యత్యాసం చూపిస్తుంది. ఉదాహరణకు 20 ఏళ్ల కాలానికి 9 శాతం వడ్డీ రేటుతో రూ. 50 లక్షలు గృహ రుణం తీసుకున్న వ్యక్తికి 0.25 శాతం ద్వారా వడ్డీ రేటు 8.75 శాతానికి తగ్గుతుంది. తద్వారా కట్టాల్సిన మొత్తం రూ. 57.96 లక్షల నుంచి రూ. 53.60 లక్షలకు తగ్గుతుంది. అంతేకాకుండా అప్పు చెల్లించే కాలవ్యవధి 240 నెలల నుంచి 230 నెలలకు దిగొస్తుంది.
ఆర్‌బీఐ గవర్నర్ ప్రసంగంలో కీలకమైన అంశాలు..
వృద్ధి
ప్రపంచ వృద్ధి చారిత్రాత్మక సగటు కంటే తక్కువగా ఉంది. ప్రపంచ ఆర్థికవ్యవస్థ ద్రవ్యోల్బణం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అనిశ్చితితో సహా పలు సవాళ్లను ఎదుర్కొంటుంది. బలమైన డాలర్ అభివృద్ధి చెందుతున్న మార్కెట్ కరెన్సీలను ప్రభావితం చేస్తోంది. వీటిని అధిగమించి భారత్‌లో ప్రైవేట్ వినియోగం, సేవలు, వ్యవసాయ రంగాలలో పునరుద్ధరణ ద్వారా ప్రస్తుత 2024-25 ఆర్థిక సంవత్సరం దేశ జీడీపీ వృద్ధి 6.4 శాతం ఉంటుందని అంచనా వేశారు.
ద్రవ్యోల్బణానికి సంబంధించి ఆహార పదార్థాల ధరలు నెమ్మదించిన కారణంగా 2024-25లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.8 శాతంగా ఉంటుందని, కొత్త 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఇది 4.2 శాతానికి దిగి రావొచ్చని తెలిపారు. భవిష్యత్తులో ద్రవ్యోల్బణం ప్రపంచ ఆర్థిక మార్కెట్లలో అనిశ్చితి, ఇంధన ధరల అస్థిరత, ప్రతికూల వాతావరణ సంఘటనల వల్ల పెరిగే ఛాన్స్ ఉన్నప్పటికీ మితంగానే ఉంటుంది.
బ్యాంకుల డొమైన్ మార్పు..
దేశవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ మోసాలను కట్టడి చేసేందుకు ఆర్‌బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఎంపీసీ సమావేశం అనంతరం ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా మాట్లాడుతూ.. ఇకపై భారతీయ బ్యాంకులన్నీ బ్యాంక్.ఇన్ అనే డొమైన్, ఎన్‌బీఎఫ్‌సీలకు ఫిన్.ఇన్ డొమైన్‌తో ఉంటుంది. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి ఇరు సంస్థల రిజిస్ట్రేషన్లు తీసుకోనున్నట్టు సంజయ్ మల్హోత్రా పేర్కొన్నారు. దీంతో పాటూ మనదేశంలో జారీ అయిన కార్డుల నుంచి విదేశాల్లో జరిపే లావాదేవీలు అడిషనల్ ఫ్యాక్టర్ ఆఫ్ అథంటికేషన్(ఏఎఫ్ఏ) జత చేయనున్నట్టు సంజయ్ మల్హోత్రా చెప్పారు. విదేశాల్లో సురక్షితమైన లావాదేవీలకు ఇది పనిచేస్తుంది. త్వరలో పూర్తిస్థాయి ముసాయిదా వస్తుందన్నారు.
పెరిగిన వోస్ట్రో ఖాతాలు..
ఎగుమతి, దిగుమతి లావాదేవీలను మన కరెన్సీ రూపాయల్లో నిర్వహించేందుకు వీలు కల్పించే వోస్ట్రో ఖాతాలు పెరిగాయని ఆర్‌బీఐ తెలిపింది. దేశీయంగా 26 బ్యాంకుల వద్ద 156 వోస్ట్రో ఖాతాలు తెరిచేందుకు 30 దేశాలకు చెందిన బ్యాంకులకు అనుమతిచ్చినట్టు సంజయ్ మల్హోత్రా పేర్కొన్నారు.