RBI:ఫెడ్ బాటలో ఆర్‌బీఐ రేట్ల తగ్గింపు ఎప్పుడంటే..

by S Gopi |
RBI:ఫెడ్ బాటలో ఆర్‌బీఐ రేట్ల తగ్గింపు ఎప్పుడంటే..
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఈ వారం ప్రారంభంలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ నాలుగు సంవత్సరాల తర్వాత కీలక రేట్లను 0.50 శాతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. చాలా కాలం నుంచి ఆశిస్తున్న దానికంటే ఎక్కువ కోత కారణంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లకు ఫెడ్ నిర్ణయం అత్యంత సానుకూలమనే అంచనాలు పెరిగాయి. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో పెట్టుబడులు భారీగా పెరగవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఫెడ్ బాటలో భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) సైతం వడ్డీ రేట్లను తగ్గించే చర్యలు తీసుకోవచ్చనే అంచనాలు పెరిగాయి. అయితే, ఎస్‌బీఐ రీసెర్చ్ నివేదిక ప్రకారం.. ఆర్‌బీఐ ఈ ఏడాదిలో కీలక రేట్లను తగ్గించే అవకాశం లేదని చెబుతోంది. 2025, ఫిబ్రవరిలోనే రేట్ల కోతపై నిర్ణయం తీసుకోవచ్చని స్పష్టం చేసింది. ప్రభుత్వ నగదు నిల్వలు క్రమంగా తగ్గుతున్న కారణంగా భారత బ్యాంకింగ్ రంగానికి లిక్విడిటీ సవాళ్లు పెరగనున్నాయని, వచ్చే ఏడాది ప్రారంభంలోనే రేట్లను తగ్గించడం సరైన చర్య అని నివేదిక అభిప్రాయపడింది. ముఖ్యంగా అతిపెద్ద ఆర్థికవ్యవస్థ అమెరికాలో రేట్ల తగ్గింపు వల్ల ఎక్కువమంది పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడులకు మళ్లుతారు. దానివల్ల విదేశీ ఇన్వెస్టర్లు మన మార్కెట్లలో పెట్టుబడులు పెంచితే భారత కరెన్సీ రూపాయి విలువైన పటిష్టమవుతుంది.

ఫెడ్ రేట్ల తగ్గింపును ఆర్‌బీఐ నిర్ణయంతో ముడిపెట్టలేం..

ఇటీవల ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేథ్ దీనిపై మాట్లాడుతూ.. అమెరికా ఫెడ్ రేట్ల తగ్గింపును ఆర్‌బీఐ నిర్ణయంతో ముడిపెట్టలేమని అన్నారు. అమెరికా ఆర్థికవ్యవస్థకు మేలు చేకూర్చే విధంగా ఫెడ్ వ్యవహరించిందని, అలాగే భారత దేశీయ ఆర్థిక పరిస్థితులను పరిష్కరించడంపై ఆర్‌బీఐ దృష్టి సారిస్తుందని ఆయన తెలిపారు. రెండు ఆర్థికవ్యవస్థల మధ్య వ్యత్యాసాన్ని గుర్తించాలన్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పనిచేస్తుండగా, భారత ఆర్థిక వ్యవస్థకు అనుకూలమైన అంశాల ఆధారంగా వడ్డీరేట్ల తగ్గింపుపై ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంటుందన్నారు. వడ్డీ రేట్లను తగ్గించే విషయం ద్రవ్య పరపతి విధాన(ఎంపీసీ) కమిటీదేనని, దేశ ఆర్థిక వ్యవస్థ ప్రయోజనాలను బట్టి తగిన సమయంలో నిర్ణయం ఉంటుందన్నారు.

ఇదే సమయంలో అమెరికా ఫెడ్ నిర్ణయం భారత ఆర్థికవ్యవస్థకు సానుకూలంగా ఉంటుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. ఫెడ్ నిర్ణయం తీసుకునేందుకు పెట్టుబడిదారులు కారణం. కానీ, భారత మార్కెట్ ఇప్పటికే విదేశీ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంది. కాబట్టి ఇతర అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థల కంటే భారత్‌ఫై ప్రభావం ఎక్కువగా ఉండకపోవచ్చని ప్రధాన ఆర్థిక సలహాదారు వి అనంత నాగేశ్వరన్ వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed