ఒత్తిడిలో ఉన్న రుణాల విషయంలో అప్రమత్తత అవసరం: ఆర్‌బీఐ గవర్నర్!

by Harish |
ఒత్తిడిలో ఉన్న రుణాల విషయంలో అప్రమత్తత అవసరం: ఆర్‌బీఐ గవర్నర్!
X

ముంబై: బ్యాంకుల కార్యకలాపాల నిర్వహణలో లోటుపాట్లను గుర్తించామని భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. కొన్ని బ్యాంకులు ఒత్తిడికి గురవుతున్న రుణాల వాస్తవ స్థితిని దాచేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఆర్‌బీఐ దృష్టికి వచ్చిందని, సదరు బ్యాంకుల నిర్వహణలో ఈ అంతరాలను గమనించామని దాస్ చెప్పారు.

సోమవారం ఆర్‌బీఐ నిర్వహించిన ప్రైవేట్ బ్యాంకుల డైరెక్టర్ల సమావేశంలో దాస్ మాట్లాడుతూ, ఈ అంతరాల వల్ల మొత్తం బ్యాంకింగ్ రంగం అస్థిరతకు గురయ్యే అవకాశం ఉందన్నారు. ఈ సమస్యలను అధిగమించినప్పటికీ బ్యాంకుల బోర్డులు, మేనేజ్‌మెంట్‌లు అలాంటి ఇబ్బందులు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలి. సమర్థవంతమైన బ్యాంక్ నిర్వహణ బోర్డు ఛైర్మన్, డైరెక్టర్ల ఉమ్మడి బాధ్యత అని శక్తికాంత దాస్ స్పష్టం చేశారు.

ముఖ్యంగా బ్యాంకులు దూకుడుగా వృద్ధి చెందేందుకు అనుసరించే వ్యూహాలు, రుణాలకు సంబంధించి బోర్డు సభ్యులు అప్రమత్తంగా ఉండాలని దాస్ హెచ్చరించారు. అలాగే, సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని తొలగించేలా బ్యాంకుల సీఈఓలు చర్యలు తీసుకోవాలన్నారు. బ్యాంకుల నిర్వహణను మరింత పటిష్టం చేసేందుకు ఆర్‌బీఐ అనేక మార్గదర్శకాలను జారీ చేసినప్పటికీ లోటుపాట్లు కనిపించాయని దాస్ పేర్కొన్నారు. ఈ నెల 22న ప్రభుత్వ రంగ బ్యాంకు బోర్డు సభ్యులతో సమావేశం నిర్వహించిన ఆర్‌బీఐ, సోమవారం(29న) ప్రైవేట్ బ్యాంకు బోర్డు సభ్యులతో సమావేశమయ్యారు.

Advertisement

Next Story