భారత్‌లో 170 శాతం పెరిగిన లగ్జరీ బ్రాండ్‌ల ప్రాపర్టీ లీజింగ్

by S Gopi |
భారత్‌లో 170 శాతం పెరిగిన లగ్జరీ బ్రాండ్‌ల ప్రాపర్టీ లీజింగ్
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత్‌లో లగ్జరీ బ్రాండ్ల కంపెనీలు పెద్ద ఎత్తున ప్రాపర్టీలను లీజుకు తీసుకుంటున్నాయి. గత కొన్నేళ్ల నుంచి దేశీయంగా బ్రాండ్ ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండే ఇందుకు కారణమని ఓ నివేదిక తెలిపింది. స్థిరాస్తి కన్సల్టెన్సీ సంస్థ సీబీఆర్ఈ సౌత్ ఏషియా, పీహెచ్‌డీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్(పీహెచ్‌డీసీసీఐ) సంయుక్తంగా బుధవారం విడుదల చేసిన నివేదిక ప్రకారం, గతేడాది లగ్జరీ కంపెనీలు లీజుకు తీసుకున్న స్థిరాస్తి 6 లక్షల చదరపు అడుగులుగా నమోదైంది. ఇది 2022లో ఉన్న దానికంటే 170 శాతం అధికం కావడం గమనార్హం. మధ్యతరగతి, ఉన్నత తరగతి కారణంగా దేశంలో ప్రీమియం, లగ్జరీ వస్తువులకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. వినియోగదారుల ఇష్టాలకు అనుగుణంగా బ్రాండ్ల కంపెనీలు సైతం వారికి అనుగుణంగా రిటైల్ స్టోర్లను విస్తరిస్తున్నాయి. దీనివల్ల భారత్ క్రమంగా గ్లోబల్ లగ్జరీ బ్రాండ్లకు కీలకమైన కేంద్రంగా మారుతోందని నివేదిక తెలిపింది. లగ్జరీ బ్రాండ్ల కంపెనీలు ఎక్కువగా హై స్ట్రీట్ స్టోర్లకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాయి. వీటి వాటా మొత్తం లీజులో 45 శాతం ఉన్నాయి. ఇది 2022 కంటే రెట్టింపు. ఆ తర్వాత మాల్స్‌ను కంపెనీలు లీజుకు తీసుకుంటున్నాయి. ఇది 2022 కంటే 300 శాతం పెరిగాయి. మొత్తం లగ్జరీ లీజింగ్‌లో మాల్స్ 40 శాతం వాటా కలిగి ఉన్నాయి. మిగిలిన 15 శాతం వాటాను సొంత స్టోర్ల విస్తరణ జరుగుతోందని నివేదిక పేర్కొంది.

Advertisement

Next Story