Piyush Goyal: ఈ-కామర్స్, ఆన్‌లైన్ షాపింగ్‌పై ఆందోళన వ్యక్తం చేసిన పీయూష్ గోయల్

by S Gopi |   ( Updated:2024-08-21 14:13:43.0  )
Piyush Goyal: ఈ-కామర్స్, ఆన్‌లైన్ షాపింగ్‌పై ఆందోళన వ్యక్తం చేసిన పీయూష్ గోయల్
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో అత్యంత వేగంగా పెరుగుతున్న ఈ-కామర్స్, ఆన్‌లైన్ షాపింగ్ గురించి కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ధోరణి వల్ల సమస్యలు ఉత్పన్నం అయ్యే అవకాశాలు ఉన్నాయని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఇది దేశాన్ని సోమరితనంగా మార్చవచ్చని, బద్దకంగా ఇంట్లో కూర్చొని షాపింగ్ చేయడమనే పద్దతి దీర్ఘకాలంలో మేలు చేయదని ఆయన అభిప్రాయపడ్డారు. దేశంలో ఈ-కామర్స్ వృద్ధిని విజయంగా కాకుండా 'ఆందోళన కలిగించే అంశం'గా చూడాలని ఆయన తెలిపారు.

బుధవారం 'ఉపాధి, వినియోగదారుల సంక్షేమంపై ఈ-కామర్స్ ప్రభావం' నివేదిక విడుదల సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న పీయూష్ గోయల్.. 'ఈ-కామర్స్ కపెనీలు పెరగడం మూలంగా సామాజిక అంతరం ఏర్పడుతోంది. ఈ నెట్‌వర్క్ కారణంగా భవిష్యత్తులో గొప్ప విజయాలు సాధించవచ్చు కానీ, ఈ కంపెనీలు అనుసరించే ధరల విధానం కారణంగా సాంప్రదాయ రిటైల్ వ్యాపారాలు పడిపోతున్నాయని గుర్తించాలని ' ఆందోళన వ్యక్తం చేశారు.

ఇది దేశానికి మంచిదా కాదా అనేది ఆలోచించాలని సూచించారు. ప్రస్తుతం అనేక బడా ఈ-కామర్స్ సంస్థలు రచించే పెట్టుబడి వ్యూహాలు తమ బ్యాలెన్స్ షీట్‌ల నష్టాలను తగ్గించేందుకేనని పీయూష్ గోయల్ అభిప్రాయపడ్డారు. పెద్ద పెద్ద రిటైలర్ల వల్ల ఏళ్లుగా మనం చూస్తున్న చిన్న రిటైలర్ దుకాణాలు కనుమరుగవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Next Story