అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు పోటీగా హైదరాబాద్‌లో ప్రభుత్వ ఈ కామర్స్ సేవలు

by Harish |   ( Updated:2023-07-06 10:39:15.0  )
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు పోటీగా హైదరాబాద్‌లో ప్రభుత్వ ఈ కామర్స్ సేవలు
X

న్యూఢిల్లీ: ప్రభుత్వానికి చెందిన ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఓఎన్‌డీసీ సేవలను విస్తరించింది. చిన్న వ్యాపారులకు మద్దతిచ్చేందుకు ప్రారంభించిన ఈ ప్లాట్‌ఫామ్ కొత్తగా హైదరాబాద్‌తో పాటు ముంబై, ఢిల్లీ, చెన్నై, కలకత్తా వంటి నాలుగు నగరాల్లో వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాట్‌ఫామ్ కస్టమర్లు తమకు కావాల్సిన ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చని ఓఎన్‌డీసీ తెలిపింది. అంతేకాకుండా పేటీఎం, స్పైస్ మనీ, మ్యాజిక్‌పిన్, మైస్టోర్ లాంటి ప్లాట్‌ఫామ్‌ల నుంచి కూడా ఓఎన్‌డీసీ సేవలను పొందే వీలుంటుందని పేర్కొంది.

ప్రస్తుతానికి 200 నగరాల్లో ఓఎన్‌డీసీ సేవలు అందుబాటులో ఉన్నాయని, 40 వేల మంది వరకు చిన్న వ్యాపారులు ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా ఆదాయాన్ని పొందుతున్నట్టు ఓఎన్‌డీసీ వివరించింది. తాజా విస్తరణ ద్వారా మరింత కొత్త వ్యాపారులు ఓఎన్‌డీసీ నెట్‌వర్క్‌లో చేరేందుకు ఆసక్తి చూపిస్తారని, దీనివల్ల మరిన్ని నగరాలకు సేవలను విస్తరించవచ్చని ఓఎన్‌డీసీ సీఈఓ కోషి అన్నారు.

కొత్తగా జత చేసిన నగరాల్లోని వినియోగదారుల నుంచి వచ్చిన స్పందన ఆధారంగా సేవలను దేశవ్యాప్తంగా అందించే ప్రయత్నాలు జరుగుతాయని ఆయన వెల్లడించారు. దేశీయ ఈ-కామర్స్ రంగంలో ప్రైవేట్ రంగ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ కంపెనీల ఆధిపత్యాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం ఓఎన్‌డీసీని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story