- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Ola Electric: 1,000 మందిని తొలగించేందుకు సిద్ధమైన ఓలా ఎలక్ట్రిక్

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఎలక్ట్రిక్ టూ-వీలర్ తయారీ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ మరోసారి లేఆఫ్ ప్రక్రియను చేపట్టనుంది. పెరుగుతున్న నష్టాలను భర్తీ చేసేందుకు 1,000 మందికి పైగా ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులను తొలగించడానికి కంపెనీ సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. ప్రధానంగా ప్రొక్యూర్‌మెంట్, ఫుల్‌ఫిల్‌మెంట్, కస్టమర్ రిలేషన్, ఛార్జింగ్ ఇన్‌ఫ్రా వంటి విభాగాల్లో ఈ తొలగింపులు ఉంటాయని భావిస్తున్నారు. ఈ నిర్ణయంతో ఓలా ఎలక్ట్రిక్ గడిచిన ఐదు నెలల వ్యవధిలోనే రెండోసారి లేఆఫ్ ప్రకటించినట్టు అవుతుంది. గతేడాది నవంబర్‌లోనూ 500 మంది ఉద్యోగులను కంపెనీ ఇంటికి సాగనంపింది. ఆ తర్వాత డిసెంబర్ త్రైమాసికంలో నష్టాలు 50 శాతం పెరగడం, కంపెనీ కార్యకలాపాలు, సేవలపై ఫిర్యాదులు పెరగడంతో భారత మార్కెట్ రెగ్యులేటర్, కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ పరిశీలనలో ఓలా ఉండటం వంటి పరిణామాలతో కంపెనీ తాజా తొలగింపు నిర్ణయం తీసుకుంది.
బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం, కొత్తగా తొలగించే ఉద్యోగులు ఓలా మొత్తం వర్క్‌ఫోర్స్‌లోని(దాదాపు 4,000 మంది) పావు వంతు మందికి సమానం కానుంది. ఈ అంశంపై కంపెనీ స్పష్టత ఇవ్వాల్సి ఉంది. వారిలో కాంట్రాక్ట్ కార్మికులు కూడా ఉన్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. పునర్నిర్మాణంలో భాగంగా ఓలా తన కస్టమర్ రిలేషన్స్ కార్యకలాపాల విభాగాలను ఆటోమేట్ చేస్తోంది. మెరుగైన ఉత్పాదకత కోసం అనవసరమైన పాత్రలను తొలగిస్తూ, మెరుగైన మార్జిన్‌లు, తక్కువ ఖర్చు, మెరుగైన కస్టమర్ అనుభవాన్ని అందించడానికి ఈ ప్రక్రియను మొదలుపెట్టామని కంపెనీ చెబుతోంది. కాగా, ఇటీవలి డిసెంబర్ త్రైమాసికంలో ఓలా కంపెనీ రూ. 564 కోట్ల నష్టాలను నమోదు చేసింది. ఈవీ విభాగంలో పోటీ పెరగడం, కంపెనీ అందించే సేవల్లో పెద్ద ఎత్తున లోపాలు, వాటి పరిష్కారానికి ఎక్కువ ఖర్చు చేయడంతో కంపెనీ భారీ మొత్తం నష్టాలను చూసింది. ఫలితంగా గతేడాది ఆగస్టులో ఓలా ఎలక్ట్రిక్ షేర్లు లిస్టింగ్ తర్వాత 60 శాతానికి పైగా క్షీణించాయి.