GST: జీవిత, వైద్య బీమా ప్రీమియంలపై జీఎస్టీని తొలగించండి: నితిన్ గడ్కరీ

by Harish |
GST: జీవిత, వైద్య బీమా ప్రీమియంలపై జీఎస్టీని తొలగించండి: నితిన్ గడ్కరీ
X

దిశ, బిజినెస్ బ్యూరో: జీవిత, వైద్య బీమా ప్రీమియంలపై 18 శాతం వస్తు సేవల పన్ను(జీఎస్టీ)ని ఉపసంహరించుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కోరారు. నాగ్‌పూర్ డివిజనల్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ నుండి గడ్కరీకి జీఎస్టీకి సంబంధించి విజ్ఞప్తులు వచ్చాయి. కుటుంబానికి కొంత రక్షణ కల్పించడానికి ఉద్దేశించిన జీవిత బీమా ప్రీమియంలపై పన్ను విధించకూడదని యూనియన్ గడ్కరీని కోరింది. అదేవిధంగా వైద్య బీమా ప్రీమియంపై 18 శాతం జీఎస్టీ సామాజికంగా అవసరమైన ఈ విభాగం వ్యాపార వృద్ధికి ప్రతిబంధకంగా ఉంటుందని వారు అన్నారు.

దీంతో ఈ సమస్యలను ప్రస్తావిస్తూ, నితిన్ గడ్కరీ ఆర్థిక మంత్రికి లేఖ రాశారు. తనను కలిసిన యూనియన్ నాయకులు సీనియర్ సిటిజన్లకు ఇబ్బందికరంగా మారిన కొన్ని నిబంధనలను కూడా మార్చాలని కోరినట్లు ఆయన తెలిపారు. జీవిత, వైద్య బీమా ప్రీమియంపై జీఎస్టీ చెల్లించడం సీనియర్ సిటిజన్లకు సవాలుతో కూడుకున్నదని, జీవిత బీమా ద్వారా సేవింగ్స్‌కు డిఫరెన్షియల్ ట్రీట్‌మెంట్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం కోసం ఐటీ మినహాయింపును తిరిగి ప్రవేశపెట్టడంతోపాటు ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీల ఏకీకరణ అంశాన్ని కూడా యూనియన్ లేవనెత్తిందని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు.

అయితే, ఆరోగ్య బీమా ప్రీమియంలపై జీఎస్టీని పునఃపరిశీలించాలని నిర్మలా సీతారామన్‌ను అభ్యర్థించడం ఇదే మొదటిసారి కాదు. వ్యక్తిగత ఆరోగ్య పాలసీలపై జీఎస్టీని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని ఈ ఏడాది జూన్‌లో కాన్ఫెడరేషన్ ఆఫ్ జనరల్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. కానీ తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌‌లో ఎలాంటి ఉపశమనం లభించలేదు.

Advertisement

Next Story

Most Viewed