- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
New Pension Scheme: దేశంలోని అందరికీ కొత్త 'యూనివర్సల్ పెన్షన్ స్కీమ్'

దిశ, బిజినెస్ బ్యూరో: అసంఘటిత రంగంలో ఉన్నవారితో సహా దేశంలోని అందరి కోసం కొత్త పెన్షన్ పథకాన్ని తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది. 60 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందేలా 'యూనివర్సల్ పెన్షన్ స్కీమ్'పై కసరత్తు జరుగుతోణ్దని కార్మిక మంత్రిత్వ శాఖ వర్గాలు బుధవారం తెలిపాయి. ప్రధానంగా ఎటువంటి సామాజిక భద్రత పథకం పరిధిలోకి రాని నిర్మాణ రంగంలోని కార్మికులతో పాటు గిగ్ వర్కర్లకు ప్రయోజనం కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ పథకం వేతనజీవులతో పాటు స్వయం ఉపాధి పొందే వారికి కూడా అందుబాటులో ఉంటుంది. 18 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు వారందరూ 60 ఏళ్ల తర్వాత పెన్షన్ ప్రయోజనాలు పొందే వీలుంటుంది. ఉపాధితో సంబంధం లేకుండా, ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ఈ పథకాన్ని ఎంచుకునే వీలు కల్పించనున్నారు. ఇప్పటికే ఉన్న కొన్ని పెన్షన్, పొదుపు పథకాలను కొత్త పథకం కిందకు తీసుకురానున్నారు. ప్రస్తుతానికి ఈ పథకం రూపకల్పన, విధివిధానాలపై కసరత్తు జరుగుతోంది. త్వరలో అమలుకు సంబంధించి సమగ్ర వివరాలను వెల్లడించనున్నారు. ప్రస్తుతం ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత పెన్షన్ అందించేందుకు ఈపీఎఫ్ఓ, వీధి వ్యాపారుల కోసం ప్రధాన్ మంత్రి శ్రమ యోగి మాన్ ధన్ యోజన (పీఎం-ఎస్‌వైఎం), వ్యాపారులు, స్వయం ఉపాధి పొందుతున్న జాతీయ పెన్షన్ పథకం, రైతుల కోసం పీఎం కిసాన్ మాన్‌దాన్ యోజన వంటి పథకాలు ఉన్నాయి. ఈ క్రమంలో దేశంలోని ప్రతి ఒక్కరికీ ఒకే పెన్షన్ పథకం తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది.