తొలిసారి 81,000 దాటిన సెన్సెక్స్

by S Gopi |
తొలిసారి 81,000 దాటిన సెన్సెక్స్
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లు సరికొత్త రికార్డు స్థాయిలకు చేరాయి. గత కొద్ది సెషన్లుగా కొత్త గరిష్ఠాలను నమోదు చేస్తున్న సూచీలు గురువారం ట్రేడింగ్‌లో మరింత దూకుడుగా ర్యాలీ చేశాయి. ఈ క్రమంలోనే చరిత్రలోనే తొలిసారిగా సెన్సెక్స్ ఇండెక్స్ 81,000 మైలురాయిని అధిగమించింది. నిఫ్టీ సైతం 25 వేల మార్కుకు చేరువగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మద్దతు లేకపోయినప్పటికీ దేశీయంగా కీలక బ్లూచిప్ ఐటీ స్టాక్స్‌లో భారీ కొనుగోళ్లు మార్కెట్ల రికార్డుల ర్యాలీకి కారణమయ్యాయి. జూన్ త్రైమాసిక ఫలితాల్లో ఐటీ కంపెనీలు మెరుగైన ఆదాయ వివరాలను ప్రకటిస్తున్నాయి. అందుకే మదుపర్లు ఐటీ షేర్ల పట్ల ఆసక్తి చూపించారు. వీటితో పాటు బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ రంగాలు కూడా రాణించాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 626.91 పాయింట్లు లాభపడి 81,343 వద్ద, నిఫ్టీ 187.85 పాయింట్ల లాభంతో 24,800 వద్ద ముగిశాయి. నిఫ్టీలో మీడియా, మెటల్, రియల్టీ రంగాలు మినహా దాదాపు అన్ని రంగాలు రాణించాయి. ఐటీ రంగం 2.2 శాతం పుంజుకుంది. సెన్సెక్స్ ఇండెక్స్‌లో టీసీఎస్, ఎంఅండ్ఎం, బజాజ్ ఫిన్‌సర్వ్, ఇన్ఫోసిస్, హిందూస్తాన్ యూనిలీవర్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్, ఎస్‌బీఐ షేర్లు 1 శాతానికి పైగా పెరిగాయి. ఏషియన్ పెయింట్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎన్‌టీపీసీ, అదానీ పోర్ట్స్, పవర్‌గ్రిడ్, టాటా స్టీల్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.64 వద్ద ఉంది.

Advertisement

Next Story