Insta Teen Accounts: తల్లిదండ్రుల పర్యవేక్షణలో ఇన్‌స్టాగ్రామ్‌లో టీన్ అకౌంట్స్

by S Gopi |
Insta Teen Accounts: తల్లిదండ్రుల పర్యవేక్షణలో ఇన్‌స్టాగ్రామ్‌లో టీన్ అకౌంట్స్
X

దిశ, బిజినెస్ బ్యూరో: సోషల్ మీడియా దిగ్గజం మెటా కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణ జీవితంలో భాగమైన సోషల్ మీడియా పిల్లల జీవితంపై ఎక్కువ ప్రభావం చూపుతోంది. దీనిపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రత్యేకంగా టీన్ అకౌంట్స్‌ను ప్రారంభించింది. ఈ అకౌంట్లు 18 ఏళ్ల లోపు వారి కోసం ఉద్దేశించినవి. ఇన్‌స్టాగ్రామ్ పిల్లలకు కూడా సురక్షితమైన ప్లాట్‌ఫామ్‌గా నిర్వహించేందుకు మెటా దీన్ని తీసుకొచ్చింది. మెటా వివరాల ప్రకారం.. ఇకనుంచి కొత్తగా ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్ ఓపెన్ చేసే 18 ఏళ్లలోపు వారి అకౌంట్లు ఆటోమెటిక్‌గా టీన్ అకౌంట్లుగా పనిచేస్తాయి. ఈ అకౌంట్లలో పిల్లలకు చెందిన భద్రతను పెంచడం, తల్లిదండ్రుల నియంత్రణ అవకాశాలు ఉంటాయి. ఇప్పటికే 18 ఏళ్లలోపు ఉన్న వారి అకౌంట్లను కూడా రెండు నెలల్లోగా టీన్ అకౌంట్లకు మార్చనున్నట్టు మెటా ప్లాట్‌ఫామ్స్ వెల్లడించింది. ప్రస్తుతం టీన్ అకౌంట్లను అమెరికాతో పాటు కెనడా, యూకే, ఆస్ట్రేలియాల్లో అమల్లోకి తెచ్చినట్టు స్పష్టం చేసింది. టీన్ అకౌంట్ల నిబంధనల్లో ఇప్పటికే ఫాలో అవుతున్న అకౌంట్ల నుంచి మాత్రమే మెసేజ్‌లను పొందే వీలుంటుంది. ఫాలో అయ్యే వారిని మాత్రమే ట్యాగ్ చేసే వీలుంటుంది. ముఖ్యంగా కొన్ని సెన్సిటివ్ కంటెంట్‌కు సంబంధించి పూర్తిస్థాయిలో నియంత్రణ ఉంటుంది. ఎవరైనా డిఫాల్ట్ సెట్టింగ్ కావాలనుకుంటే తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి ఉండాలని, దానివల్ల పిల్లలకు చెందిన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లపై తల్లిదండ్రులకు పర్యవేక్షణ ఉంటుందని మెటా వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed